తమిళనాడులోని ప్రముఖ కుడంకుళం అణు విద్యుత్ కేంద్రానికి (KKNPP) సంబంధించిన కీలక పత్రాలు లీక్ అయ్యాయనే వార్త దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రాజెక్టు కాంట్రాక్ట్ పనుల్లో భాగస్వామిగా ఉన్న రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు చెందిన థర్డ్ పార్టీ సర్వర్ ‘యొట్టా (Yotta) డేటా సర్వీసెస్’ హాకింగ్‌కు గురికావడంతో ఈ డేటా లీక్ అయినట్లు తెలుస్తోంది.
డార్క్ వెబ్‌లో కుడంకుళం రియాక్టర్‌కు చెందిన సుమారు 19 వేల కీలక పత్రాలను హ్యాకర్లు బహిర్గతం చేసినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థల కథనాల ద్వారా వెల్లడైంది. లీకైన సమాచారంలో అణు ప్లాంట్ కంట్రోల్ రూమ్ మ్యాప్‌లు, ఇంజనీరింగ్ బ్లూప్రింట్లు, వెండర్ల వివరాలు ఉన్నట్లు సమాచారం.
దేశ రక్షణ, భద్రతకు సంబంధించిన అత్యంత కీలకమైన అణు కేంద్రం సమాచారం లీక్ కావడంతో భారత ప్రభుత్వం తక్షణమే స్పందించింది. జాతీయ సైబర్ భద్రతా సంస్థ (CERT-In) రంగంలోకి దిగి ఈ హ్యాకింగ్, డేటా లీక్‌పై సమగ్ర దర్యాప్తును ప్రారంభించింది. డేటా ఏ స్థాయిలో లీక్ అయింది? దీని వెనుక ఉన్న హ్యాకర్ల గ్రూప్ ఏది? అనే కోణంలో అధికారులు ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు.
ఈ డేటా లీక్ వార్తలపై న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) స్పందించింది. ప్రజలు గానీ, రక్షణ నిపుణులు గానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అణు భద్రతకు ఎలాంటి ముప్పు లేదని అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం లీకైంది కేవలం సాధారణ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (Balance of Plant) మరియు నిర్మాణ పనులకు సంబంధించిన పత్రాలు మాత్రమేనని తెలిపింది.
కుడంకుళం అణు రియాక్టర్‌కు సంబంధించిన ప్రధాన నియంత్రణ వ్యవస్థలు లేదా కోర్ సెక్యూరిటీ సిస్టమ్స్ డేటా పూర్తిగా సురక్షితంగా ఉంది. వీటికి థర్డ్ పార్టీ సర్వర్‌లతో ఎలాంటి సంబంధం ఉండదు. ప్రస్తుతం లీకైనట్లు ప్రచారంలో ఉన్న పత్రాలు.. నిర్మాణ దశలో ఉన్న యూనిట్ 3 మరియు 4 కి సంబంధించిన సాధారణ సివిల్ వర్క్స్ వివరాలు మాత్రమేనని అధికారులు తేల్చి చెప్పారు.
థర్డ్ పార్టీ క్లౌడ్ సర్వర్‌లలో భద్రతా లోపాల వల్లే ఈ డేటా బయటకు వచ్చిందని, ప్లాంట్ అంతర్గత నెట్‌వర్క్ కంప్లీట్ ఐసోలేటెడ్ ఉంటుందని, కాబట్టి సైబర్ దాడుల ద్వారా అణు ప్లాంట్ నిర్వహణకు ఎలాంటి ప్రమాదం పొంచి లేదని నిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలను మరింత కఠినతరం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.








