బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మూడోసారి వివాహం చేసుకున్న తర్వాత తన భార్య గౌరీ స్ప్రాట్కు భారీ బహుమతి ఇచ్చినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. షష్టిపూర్తి వేడుకలు పూర్తైన కొద్ది రోజులకే అమీర్ ఖాన్ గౌరీ స్ప్రాట్ను తన జీవిత భాగస్వామిగా స్వీకరించారు. ఈ నెల 5న ముంబయిలోని తన నివాసంలో అత్యంత నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
పెళ్లి అనంతరం గౌరీకి అమీర్ ఖాన్ విలాసవంతమైన స్కై విల్లాను బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం. ముంబైలో నిర్మాణంలో ఉన్న ఈ స్కై విల్లా విలువ సుమారు రూ.100 కోట్లుగా చెబుతున్నారు. ఈ విల్లాలో అమీర్ ఖాన్, గౌరీ స్ప్రాట్ మాత్రమే కాకుండా ఇరు కుటుంబాల సభ్యులు కూడా కలిసి నివసించేలా ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
గౌరీ తన కుమారుడు క్విన్తో పాటు తన తల్లిదండ్రులతో కలిసి నివసించనున్నట్లు సమాచారం. దీనికి అమీర్ ఖాన్ కూడా అంగీకరించారని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే అమీర్ కుటుంబ సభ్యులు కూడా ఈ నివాస సముదాయంలోనే ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. కుటుంబాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ భారీ ప్రాజెక్టును గౌరీకి బహుమతిగా అందించినట్లు సమాచారం.
ముంబైలోని యూనియన్ పార్క్ ప్రాంతంలో ఈ విలాసవంతమైన అపార్ట్మెంట్ నిర్మాణం జరుగుతోంది. ఇందులో మొత్తం 12 ఫ్లాట్లను అమీర్ ఖాన్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం మెరీనా అపార్ట్మెంట్లో నివసిస్తున్న అమీర్ ఖాన్, నిర్మాణం పూర్తయిన తర్వాత కొత్త నివాసానికి మారనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక నిర్మాణం 2030 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని సమాచారం.








