కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యుడు ముద్రగడ పద్మనాభం మృతిపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముద్రగడ ఆకస్మిక మరణం తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు, తనకు పితృసమానులైన ముద్రగడ మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందన్న వైఎస్ జగన్.. ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ముద్రగడ విలువలకు కట్టుబడి రాజకీయాలు చేశారని, పదవులకన్నా ప్రజలనే గొప్పగా భావించారని గుర్తుచేశారు.
ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి పెద్దదిక్కుగా నిలిచి, వారి సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేశారని గుర్తుచేశారు. తాను నమ్మిన మాటకు కట్టుబడి నిలబడే తత్వం, మంచికోసం ఎంతదూరమైనా వెళ్లే ధైర్యం ఆయన సొంతమని కొనియాడారు. ఆత్మగౌరవానికి, నిజాయితీకి, వ్యక్తిత్వానికి ఆయన నిలువెత్తు రూపం ముద్రగడ అని, ముద్రగడ మరణం ఆయన కుటుంబానికే కాదు.. వైసీపీకి, ఆయనను అభిమానించే లక్షలాది మందికి తీరని లోటని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరిబాబుకు వైఎస్ జగన్ వ్యక్తిగతంగా ఫోన్ చేసి పరామర్శించారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ముద్రగడ పద్మనాభం ప్రజల కోసం, ముఖ్యంగా సామాజిక న్యాయం కోసం చేసిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఆయన ప్రజా జీవితంలో చూపిన నిబద్ధత, సమాజం కోసం చేసిన పోరాటాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని కొనియాడారు.
ముద్రగడ మరణం వైసీపీకి, ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి తీరని లోటని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. ఈ క్లిష్ట సమయంలో ముద్రగడ కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
మా పార్టీ సీనియర్ నాయకులు, నాకు పితృసమానులైన ముద్రగడ పద్మనాభంగారి మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది.
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 14, 2026
ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన క్రమంగా కోలుకుంటున్నారనే వార్త మాకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మన మధ్యకు వస్తారని ఆశిస్తున్న సమయంలోనే ఆయన ఇలా శాశ్వతంగా… pic.twitter.com/HReowspJ4e








