జగన్ రాకతో కదిలిన యంత్రాంగం.. ఇర‌కాటంలో ప్ర‌భుత్వం!

జగన్ రాకతో కదిలిన యంత్రాంగం.. ఇర‌కాటంలో ప్ర‌భుత్వం

Summarize with AI

విజ‌య‌వాడ (Vijayawada) న‌డిబొడ్డున జ‌రిగిన ఉదంతంతో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం (Chandrababu Government) ఇర‌కాటంలో ప‌డింది. క్రిమిన‌ల్ అని, 40-50 కేసులున్నాయ‌ని ప్ర‌చారం చేసినా, ఆ త‌ల్లి వేధ‌న‌ ముందు ఆ పాచిక‌లేవీ పార‌లేదు. జ‌గ‌న్ ప‌రామ‌ర్శ త‌రువాత బాధిత కుటుంబానికి మ‌ద్ద‌తు పెరిగింది. ప్ర‌భుత్వంలోనూ వేగంగా క‌ద‌లిక‌లు మొద‌ల‌య్యాయి.

కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ (Gade Sai Krishna) అదృశ్యం/లాకప్ డెత్ (Lockup Death) ఆరోపణల కేసులో ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగంలో వేగంగా కదలిక వచ్చింది. నెల రోజులుగా బాధిత తల్లి విజయలక్ష్మి(Vijayalakshmi) న్యాయం కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోని అధికారులు.. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) నిన్న బాధిత కుటుంబాన్ని పరామర్శించిన గంటల వ్యవధిలోనే చర్యలు ముమ్మరం చేశారు. రాత్రి 11 గంటల సమయంలో కృష్ణలంక సీఐ (Krishnalanka CI) నాగరాజుపై (Nagaraju) ఎఫ్‌ఐఆర్ నమోదు కావడంతో పాటు, ఏసీపీ స్థాయి అధికారితో ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశాలు జారీ అయ్యాయి.

సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి నుంచి విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు (Rajasekhar Babu) స్వయంగా ఫిర్యాదును స్వీకరించారు. తన కొడుకును పోలీసులు తీసుకెళ్లి లాకప్ డెత్ చేశారనే తల్లి ఆరోపణల ఆధారంగా సీఐ నాగరాజుపై అర్ధరాత్రి 11 గంటలకు కేసు నమోదు చేశారు. పోలీసు అధికారులు నిబంధనల ప్రకారం ఫిర్యాదు కాపీని స్వయంగా బాధిత తల్లికి అందజేశారు.

సీఐ నాగరాజుపై CR No – 107/2026 u/s 127(4), 127(6), 103(1) BNS, 238 BNSS సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కేసు తీవ్రతను బట్టి దీని దర్యాప్తు అధికారిగా దిశా పీఎస్ ఏసీపీ (ACP) దైవ ప్రసాద్‌ను సీపీ రాజశేఖర్ బాబు నియమించారు. ఆదేశాలు వచ్చిన వెంటనే ఏసీపీ బృందం ఈరోజు ఉదయమే సాయికృష్ణ నివాసానికి చేరుకుని విచారణ ప్రారంభించింది.

“నా కొడుకు బతికుంటే చూపించండి.. లేదా చంపేసి ఉంటే కనీసం వాడి శవాన్ని ఇవ్వండి.. అదీ లేకపోతే బూడిదైనా నా చేతిలో పెట్టండి” అంటూ గత కొన్ని రోజులుగా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి కన్నీరుమున్నీరవుతున్న తీరు స్థానికులను తీవ్రంగా చలింపజేస్తోంది.

ఈ కేసును నీరుగార్చేందుకు అధికార పార్టీకి అనుకూలంగా ఉండే సోషల్ మీడియా శ్రేణులు సాయికృష్ణపై 40 నుంచి 50 కేసులు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశాయి. అయితే, అతనిపై కేవలం 2 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయని కుటుంబ పక్షాన నిలిచిన న్యాయవాది కనకదుర్గ (Kanaka Durga) స్పష్టం చేశారు. అవాస్తవాలు ప్రచారం చేసేవారు బెంచ్ సర్కిల్‌కు వచ్చి నిరూపించాలని ఆమె సవాల్ విసిరారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) స్వయంగా బాధితురాలి ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పడం, అండగా ఉంటామని హామీ ఇవ్వడంతో ఈ కేసు ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జగన్ పరామర్శను కొన్ని టీడీపీ(TDP) అనుకూల మీడియా సంస్థలు సైతం అభినందించడం విశేషం. జగన్ రాకతో బాధిత కుటుంబానికి రాజకీయాలకు అతీతంగా వామపక్ష నేతలు, ప్రజా సంఘాల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. దీంతో తీవ్ర ఒత్తిడికి లోనైన చంద్రబాబు ప్రభుత్వం గంటల వ్యవధిలోనే సీఐ నాగ‌రాజుపై కేసు నమోదు చేయక తప్పని పరిస్థితి నెలకొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment