మెడికల్ కాలేజీలను పీపీపీ (PPP) విధానంలో ప్రైవేటీకరించడంపై మాజీ మంత్రి విడదల రజిని (Vidudala Rajini) చంద్రబాబు ప్రభుత్వంపై (N. Chandrababu Naidu) తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలు కోటి సంతకాలతో చంద్రబాబు ప్రభుత్వానికి బండకేసి కొట్టారని, ప్రభుత్వం తప్పు చేస్తోందని ప్రజలే చెంప ఛెళ్లుమనిపించినట్లు సంతకాలు చేసి పంపించారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టిన ప్రజలనే దొంగలని, సైకోలని అవమానించడం సిగ్గుచేటని ఆమె మండిపడ్డారు. తాడేపల్లిలోని (Tadepalli) వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో రజిని మాట్లాడారు.
మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించడం లేదని, ఈ అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఈ విషయంపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం ప్రతి అంశాన్ని పీపీపీ విధానం పేరుతో నెట్టుకొస్తోందని విమర్శించారు. “అన్నింటికీ పీపీపీ మంత్రదండంలా పనిచేస్తుందనుకుంటున్నారా? పోలీస్ స్టేషన్లను కూడా పీపీపీ విధానంలో ఇస్తారా? లా అండ్ ఆర్డర్‌ను కూడా ప్రైవేటుకు అప్పగిస్తారా?” అని ప్రశ్నించారు.
ఇప్పటికే రోడ్లను పీపీపీ విధానంలో నిర్మించి ప్రజల నుంచి టోల్ టాక్స్ వసూలు చేస్తున్నారని, ఇప్పుడు మెడికల్ కాలేజీలను కూడా పీపీపీకి అప్పగించి హెల్త్ టాక్స్ వసూలు చేసే ఆలోచన ఉందా? అని విడదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014–19 మధ్య కాలంలోనూ ఇదే విధంగా ప్రయివేటీకరణ పాట పాడారని గుర్తుచేశారు.
వైఎస్ జగన్ (Y. S. Jagan Mohan Reddy) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో పనిచేశారని ఆమె తెలిపారు. విలేజ్ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ల ద్వారా పేదలకు నాణ్యమైన వైద్యం అందించారని చెప్పారు. ప్రస్తుతం మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ వెనుక పెద్ద స్కాం దాగి ఉందని, రెండేళ్ల పాటు ప్రభుత్వమే జీతాలు చెల్లించడంలో మరో స్కాం ఉందని ఆరోపించారు. స్కాం మీద స్కాంలు చేస్తూ వైద్య ఆరోగ్య రంగాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.
108, 104 సేవలు ఇప్పుడు ఎలా పని చేస్తున్నాయో ప్రజలు గమనిస్తున్నారని, జగన్ హయాంలో అవి ఎలా పనిచేశాయో ప్రజలకు స్పష్టంగా అర్థమైందన్నారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదికలను కూడా ప్రజలకు తప్పుగా వివరిస్తున్నారని ఆరోపించారు. ఈ స్కాంల్లో పాత్రధారులు, సూత్రధారులపై కఠిన చర్యలు తప్పవని విడదల రజిని హెచ్చరించారు.








