ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ‘విరోష్’ జంట

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ‘విరోష్’ జంట

రియల్ లైఫ్ లోనూ తాము ‘సూపర్ హీరోస్ ’ అనిపించుకున్నారు టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న. గత ఫిబ్రవరిలో తాము ప్రకటించిన హామీని నిజం చేస్తూ, తాజాగా ఈ జంట ఒక గొప్ప సామాజిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విజయ్ దేవరకొండ తన తండ్రి స్వగ్రామమైన నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట నియోజకవర్గంలోని తుమ్మన్‌పేట గ్రామానికి తన సతీమణి రష్మికతో వెళ్లారు.

ఈ పర్యటన సందర్భంగా ‘ది దేవరకొండ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం ఒక అద్భుతమైన ప్రకటన వెలువడింది. అచ్చంపేట పరిధిలోని సుమారు 44కు పైగా ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల్లో 9వ, 10వ తరగతి చదువుతూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 180 మంది విద్యార్థులకు భారీ మెరిట్ స్కాలర్‌షిప్‌లను ఫౌండేషన్ అంద‌జేసింది. అచ్చంపేట్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో విజ‌య్‌-ర‌ష్మిక చేతుల మీదుగా విద్యార్థులు స్కాల‌ర్‌షిప్‌లు అందుకున్నారు.

కష్టపడి చదివి, మంచి మార్కులు సాధించి తమ తల్లిదండ్రుల పేరు నిలబెట్టిన ఆ 180 మంది ప్రతిభావంతులైన విద్యార్థుల పూర్తి వివరాలతో కూడిన మెరిట్ జాబితాను హీరో విజయ్ దేవరకొండ స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. “సొంతూరితో ఎమోషనల్ బాండింగ్ ఉంది.. ఊరికి చేయాల్సింది ఇంకా చాలా ఉంది” అంటూ విజయ్ దేవరకొండ భావోద్వేగ ప్రకటన చేశారు.

అభిమానులు ఎంతో ప్రేమగా “విరోష్” అని పిలుచుకునే ఈ స్టార్ కపుల్, వివాహం తర్వాత కూడా తమ సామాజిక బాధ్యతను పంచుకుంటున్నారు. కేవలం వెండితెరపైనే కాకుండా, నిజ జీవితంలోనూ గ్రామీణ ప్రాంత విద్యార్థుల చదువుకు అండగా నిలబడుతూ సమాజ సేవలో తాము ఎప్పుడూ ముందుంటామని మరోసారి నిరూపించారు. సొంత ఊరిపై ప్రేమతో, పుట్టిన గడ్డకు విజయ్ దేవరకొండ దంపతులు చేస్తున్న ఈ సేవపై అచ్చంపేట ప్రాంత ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment