ఏపీలో (Andhra Pradesh) ప్రధాన (శాటిలైట్) మీడియాపై పట్టున్న పాలకులకు ప్రత్యామ్నాయంగా మారిన సామాజిక మాధ్యమాలను అణచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధికారిక ఫేస్‌బుక్ పేజీ భారతదేశంలో అందుబాటులో లేకుండా చేయడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే కక్షపూరితంగా కంప్లైంట్లు ఇచ్చి అకౌంట్లు క్లోజ్ చేయిస్తున్నారంటూ వైసీపీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) కూటమి ప్రభుత్వంపై (Alliance Government) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
వైసీపీ అధికారిక ఫేస్‌బుక్ (Facebook) పేజీ నిలిచిపోవడంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు ప్రభుత్వం (Chandrababu Naidu Government) ప్రజలు, ప్రతిపక్షాల గొంతులను నులిమేస్తోందని ధ్వజమెత్తారు. “ఈ సంవత్సరం ప్రారంభంలోనే మా అధికారిక ఇన్‌స్టాగ్రామ్ (Instagram) హ్యాండిల్‌ను తొలగించారు. ఇప్పుడు ఏకంగా ఫేస్‌బుక్ (Facebook) పేజీని కూడా భారతదేశంలో అందుబాటులో లేకుండా చేశారు. ఇది కేవలం వైసీపీపై జరుగుతున్న దాడి మాత్రమే కాదు.. ఇది ప్రజాస్వామ్య విలువలు, భావప్రకటనా స్వేచ్ఛపై జరుగుతున్న దాడి!” అని జగన్ పేర్కొన్నారు.
తాము ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా కేవలం వాస్తవాలను మాత్రమే ప్రజలకు వివరిస్తున్నామని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నామని ఆయన స్పష్టం చేశారు. రాజధాని పేరుతో జరుగుతున్న దుబారా ఖర్చులు, డీఎస్‌సీ (DSC) ప్రక్రియలో చోటుచేసుకుంటున్న అవకతవకలు, టీటీడీ (TTD) నెయ్యి టెండర్లలో జరుగుతున్న విచిత్ర పరిణామాలు.. వీటన్నింటిపై సాక్ష్యాలతో సహా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నందుకే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కక్ష గట్టిందని, దీనిపై తాము ఖచ్చితంగా న్యాయపోరాటం చేస్తామని జగన్ హెచ్చరించారు.
వైసీపీకి కొత్త అస్త్రాలు నేర్పిస్తున్న టీడీపీ?
ప్రస్తుత తెలుగుదేశం పార్టీ వ్యవహారశైలి భవిష్యత్తులో ఆ పార్టీకే రివర్స్ అయ్యే ప్రమాదం కనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి సరికొత్త పద్ధతులను అధికార పార్టీయే నేర్పిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కేసులు పెట్టడం, ప్రశ్నించే వారి ఆస్తులు, ఆఫీసులను టార్గెట్ చేయడం, న్యూట్రల్ ప్లాట్‌ఫామ్స్, యూట్యూబ్ ఛానెళ్లకు నోటీసులు ఇప్పించడం.. వంటి సరికొత్త సంప్రదాయాలకు ఈ ప్రభుత్వం తెరతీస్తోందని, రేపు పొద్దున అధికారాలు మారినప్పుడు ఇవే అస్త్రాలు వారికి వ్యతిరేకంగా మారుతాయనే కనీస జ్ఞానం లేకుండా పాలకులు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
ఏపీలో మెజార్టీ ప్రధాన శాటిలైట్ మీడియా సంస్థలు అధికార పక్షానికి అనుకూలంగా ఉన్నాయనేది బహిరంగ రహస్యం. ఈ తరుణంలో విపక్షానికి డిజిటల్ మీడియానే ప్రధాన ఆయుధంగా మారింది. దీన్ని సహించలేకే, తమకు వ్యతిరేకంగా వస్తున్న గొంతును అణచివేయాలనే వ్యూహంతో పోలీసులు, ఐటీ చట్టాలను వాడుకుంటున్నారనే ఆరోపణలు బలాన్ని పుంజుకుంటున్నాయి.
భావప్రకటనా స్వేచ్ఛ అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. ఇలాంటి నియంతృత్వ చర్యల వల్ల ప్రతిపక్షాలు మరింత బలంగా, ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రజల్లోకి వెళ్తాయే తప్ప వెనక్కి తగ్గవని హెచ్చరిస్తున్నారు. అధికారంలో ఉన్నవారికి సోషల్ మీడియా విమర్శలు అనేవి తప్పులను సరిదిద్దుకునే అద్దం లాంటివి. ఆ అద్దాన్ని పగలగొట్టాలని చూడడం సంకుచితత్వమే అవుతుంది. ఈ చెడు సంప్రదాయం ప్రజాస్వామ్యానికి ఎంతమాత్రం మంచిది కాదని మేధావులు హితవు పలుకుతున్నారు.








