రెండేళ్లకే తిరగబడ్డ సీన్.. వైసీపీలో ‘కదనోత్సాహం’

రెండేళ్లకే తిరగబడ్డ సీన్.. వైసీపీలో 'కదనోత్సాహం'

రాజకీయాల్లో ఐదేళ్లు అనేది ఒక సుదీర్ఘ కాలం. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రపటం మాత్రం కేవలం రెండేళ్లలోనే శరవేగంగా మారిపోతోందా? క్షేత్రస్థాయి పరిస్థితులను చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న తరుణంలో.. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పరిణామాలు ఏపీ పాలిటిక్స్‌ను హీటెక్కించాయి. ఒకవైపు ప్రభుత్వ విజయోత్సవాలు, మరోవైపు ప్రతిపక్ష వైసీపీ ఊహించని రీతిలో రోడ్లపైకి వచ్చి చేసిన సమర శంఖం.. ఏపీలో పొలిటికల్ వైబ్స్ పెంచింది.

ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమై, “ఇక వైసీపీ పని అయిపోయింది” అనుకున్న వారి స్థితి ఇప్పుడు మేక‌పోతుపై చ‌న్నీళ్లు పోసిన‌ప్పుడు వ‌చ్చే ‘జ‌ల‌ద‌రింపు’లా అయ్యింది. కార్యకర్తలపై దాడుల నుంచి ఢిల్లీ వేదికగా మొదలైన వైసీపీ పోరాటం.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంతో మరింత ఊపందుకుంది. ప్రతీ ప్రజా సమస్యపై బలంగా పుంజుకుంటూ, ఆఖరికి చంద్ర‌బాబు ప్రభుత్వం కేబినెట్ భేటీల్లోనూ ప్రతిపక్ష వైసీపీ గురించే ప్రస్తావన వచ్చేంతలా పార్టీ క్షేత్రస్థాయిలో రీ-బౌన్స్ అయ్యింది.

కూట‌మి రెండేళ్ల పాల‌న పూర్తిచేసుకున్న సంద‌ర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ఒక్క పిలుపు పార్టీ క్యాడ‌ర్‌లో సరికొత్త జోష్ నింపింది. చంద్ర‌బాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందంటూ “వెన్నుపోటుకు రెండేళ్లు” అనే నినాదంతో రాష్ట్రవ్యాప్త నిరసనలకు జగన్ పిలుపునిచ్చారు.

అటు అనంతపురం నుంచి ఇచ్చాపురం దాకా, ఇటు జ‌గ్గ‌య్య పేట నుంచి పిఠాపురం వ‌ర‌కు ప్రతీ నియోజకవర్గంలోనూ వైసీపీ శ్రేణులు రోడ్లపైకి వచ్చాయి. నాయకులు, కార్యకర్తలు ఒకరిని మించి మరొకరు నిరసన కార్యక్రమాలు నిర్వహించడానికి పోటీ పడటం చూస్తే.. ఇది రెండేళ్ల క్రితం ఓడిపోయిన పార్టీలా కాకుండా, మరో ఏడాదిలో ఎన్నికలకు వెళ్తున్న పార్టీలా కదనోత్సాహంతో కనిపించింది. అదేం లేదు.. ఇది అతిశ‌యోక్తి అనుకుంటే కూట‌మి పొర‌ప‌డిన‌ట్టే..

కూటమి ప్రభుత్వం తాము రెండేళ్లలో అద్భుతాలు సాధించామంటూ తిరుపతి వేదికగా భారీ ఎత్తున విజయోత్సవ సభను నిర్వహించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు మాధ‌వ్‌ హాజరైన ఈ సభ.. వైసీపీ నిరసనల హోరు ముందు వెలవెలబోయింది. సభలో మంత్రి లోకేష్ మరోసారి ‘రెడ్ బుక్’ ప్రస్తావన తెచ్చినప్పటికీ, ఇప్పుడా బెదిరింపులకు భయపడేవారే లేరనే సంకేతాలను వైసీపీ స్పష్టంగా పంపించింది.

కేవలం రెండేళ్లలోనే ప్రజల్లో, స్వయంగా కూటమి శ్రేణుల్లోనూ ఒక రకమైన అసంతృప్తి మొదలైనట్లు స్పష్టమవుతోంది. దానికి ప్రధాన కారణాలు కూడా ఉన్నాయి. సూపర్ సిక్స్ వంటి పెద్ద హామీలు క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం, తమ తప్పులను కంట్రోల్ చేసుకోకుండా, రెండేళ్లు దాటినా ఇంకా గత పాలకులు, వైఎస్ జగన్ ప్రభుత్వంపైనే చంద్రబాబు, ఆయన కేబినెట్ ఆరోపణలు చేస్తుండటం పౌర సమాజానికి నచ్చడం లేదు.

క్షేత్రస్థాయిలో దోపిడీలు, అరాచకాలు ఒకింత పెరిగాయనే భావన సాధారణ ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. “కూటమి ప్రజాప్రతినిధుల కంటే.. గత వైసీపీ ప్రజాప్రతినిధులే వంద రెట్లు మేలు” అనే అభిప్రాయానికి ప్రజలు వస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.

కేవలం రెండేళ్లలోనే అధికారం ఉన్న కూటమి పార్టీల్లో గెలిచామన్న ఆనందం కంటే, వైసీపీ పోరుబాట చూసి ఒక రకమైన భయం ఆవహించినట్లు కనిపిస్తోంది. అణచివేసే కొద్దీ అట్టడుగు స్థాయి నుంచి పైకి లేచిన వైసీపీ.. ఇప్పుడు మళ్లీ అధికారంపై బలమైన భరోసాను ఏర్పరచుకుని కదనరంగంలోకి దూకింది. రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయం మరింత రసవత్తరంగా మారబోతుందనడానికి ఈ రెండేళ్ల నిరసనల పర్వమే ఒక పెద్ద ఉదాహరణ.

Join WhatsApp

Join Now

Leave a Comment