తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ప్రజాప్రతినిధి అనే విషయాన్ని మరిచిపోయి అర్ధరాత్రి వేళ నడిరోడ్డుపై మద్యం మత్తులో ఆయన సృష్టించిన బీభత్సం తీవ్ర సంచలనంగా మారింది. సొంత పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, గతంలో తనకు లాయర్‌గా వ్యవహరించిన ఈడ్పుగంటి శ్రీనివాసబాబు నివాసమే లక్ష్యంగా చింతమనేని తన అనుచరులతో కలిసి దాడికి ప్రయత్నించడం స్థానికంగా తీవ్ర అల్లకల్లోలాన్ని రేపింది. చింతమనేని వీరంగం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
చింతమనేని ప్రభాకర్ మద్యం మత్తులో ఊగుతూ, కేకలు వేస్తూ తన అనుచరులతో కలిసి ఈడ్పుగంటి శ్రీనివాస్ ఇంటి ముందుకు చేరుకున్నారు. అంతటితో ఆగకుండా ఏకంగా పొక్లెయిన్లను (JCBs) రప్పించి, గేట్లు బద్దలు కొట్టేందుకు ప్రయత్నించాడు. “అరేయ్ గేట్ తీయిరా.. వాడ్ని చంపేస్తా” అంటూ పోలీసులను తీవ్ర పదజాలంతో అరుస్తూ, బూతులు తిడుతూ చింతమనేని హంగామా సృష్టించారు. అక్కడే ఉన్న పోలీసులు వారించే ప్రయత్నం చేసినప్పటికీ.. వారి సమక్షంలోనే ఒక రౌడీలా ప్రవర్తిస్తూ ఓపెన్ వార్నింగ్‌లు ఇవ్వడం అక్కడి వారిని షాక్‌కు గురిచేసింది.
నడిరోడ్డు మీద టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని వీరంగం
— Telugu Feed (@Telugufeedsite) June 15, 2026
ఊగుతూ, అరుస్తూ బీభత్సం సృష్టించిన చింతమనేని
చింతమనేని అవినీతి, అరాచకాలకు బయటపెట్టిన @JaiTDP నేత ఇంటి వద్ద హల్చల్
ఎమ్మెల్యే అన్న సంగతి మరిచి పోలీసులు సమక్షంలోనే రౌడీలా వార్నింగ్
టీడీపీ నాయకులు ఈడ్పుగంటి శ్రీనివాస్ ఇంటి మీదకు… pic.twitter.com/v5lWXrD9Zj
ఇటీవలి కాలంలో చింతమనేని ప్రభాకర్‌కు సంబంధించిన అవినీతి, అక్రమాలు, లిక్కర్ స్కామ్‌ల గురించిన నిజాలను ఈడ్పుగంటి శ్రీనివాస్ సోషల్ మీడియా వేదికగా, మీడియా ముఖంగా బయటపెట్టినట్లు తెలుస్తోంది. తన అక్రమాలను సొంత పార్టీ నేతలే ఎండగట్టడాన్ని జీర్ణించుకోలేకపోయిన చింతమనేని, కక్షపూరితంగానే అర్ధరాత్రి దాడికి యత్నించినట్టుగా స్పష్టమవుతోంది. “ఇద్దరిలో ఎవరో ఒకరే ఉండాలి” అంటూ శ్రీనివాస్‌ను ఉద్దేశించి వార్నింగ్‌లు ఇచ్చాడు. చింతమనేనిని ఆయన కుటుంబ సభ్యులు సైతం వారించినా.. ఎవరి మాట వినకుండా రెచ్చిపోయినట్లు వీడియోల్లో స్పష్టంగా తెలుస్తోంది.
చింతమనేని ప్రభాకర్‌కు ఇలాంటి వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై ఇసుక రాంప్ వద్ద జుట్టుపట్టుకుని ఈడ్చిపడేసి దాడి చేసిన ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఆ పాత ఘటనను మర్చిపోకముందే సొంత పార్టీ నాయకుడి ఇంటిపై ఈ తరహా దాడికి యత్నించడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చింతమనేని అరాచకాలపై తెలుగుదేశం పార్టీ ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.








