మాజీ మంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజు, ఆయన కుమారుడు అరవ్‌వర్మలపై నమోదు చేసిన కేసు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన (టీడీపీ మీడియా చేసిన) విషయం తెలిసిందే.. ఈనెల 10న పలాస నియోజకవర్గం కాశీబుగ్గ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పోలీసులు నమోదు చేసిన తొలి ఎఫ్‌ఐఆర్ (FIR) కు, ఆ తర్వాత దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టు (Remand Report) కు మధ్య అనేక తీవ్రమైన వ్యత్యాసాలు, వైరుధ్యాలు బయటపడ్డాయి.
తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా కథనాలు, సోషల్ మీడియా దాడి వేళ… అసలు ఎఫ్‌ఐఆర్, రిమాండ్ రిపోర్టు పత్రాలను నిశితంగా పరిశీలిస్తే దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి.
- రోడ్డు ప్రమాదం స్థానంలో హత్యానేరం చేర్పు
- 2026 జూలై 10 రాత్రి 9.30 గంటలకు జరిగిన ఘటనను ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ వల్ల సంభవించిన సాధారణ రోడ్డు ప్రమాదంగా పేర్కొంటూ, తొలి ఎఫ్ఐఆర్‌లో బీఎన్ఎస్ సెక్షన్ 106(1) కింద కేసు నమోదు చేశారు.
- రెండు రోజుల తర్వాత కేసును కల్పబుల్ హోమిసైడ్ (నేరపూరిత హత్య)గా మార్చి, సెక్షన్ 105తోపాటు కుట్ర, సాక్ష్యాల మాయం, తప్పుడు సమాచారం, నిందితుడికి ఆశ్రయం కల్పించడం వంటి తీవ్రమైన సెక్షన్లను చేర్చారు.
- ప్రమాద కేసును హత్యానేరంగా మార్చడానికి పోలీసులకు లభించిన కొత్త శాస్త్రీయ లేదా ప్రత్యక్ష ఆధారాలు ఏమిటో ప్రభుత్వం బహిర్గతం చేయాల్సి ఉంది.
- డ్రైవర్ గుర్తింపు మార్పు
- మొదటి ఎఫ్ఐఆర్‌లో బైక్ నడిపిన వ్యక్తిగా సిద్ధార్థ్ పేరును పొందుపరిచారు. సీదిరి అప్పలరాజు కానీ, ఆయన కుమారుడు అరవ్‌వర్మ కానీ ఇందులో నిందితులుగా లేరు.
- రిమాండ్ రిపోర్టులో మాత్రం బైక్ నడిపింది అరవ్‌వర్మేనని, సిద్ధార్థ్‌ను డ్రైవర్‌గా చిత్రీకరించి కుట్ర చేశారని పోలీసులు పేర్కొన్నారు.
- ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే.. డ్రైవర్ సిద్ధార్థ్ కాదని అరవ్‌వర్మ అని మార్చడానికి పోలీసుల వద్ద ఉన్న ప్రత్యక్ష సాక్ష్యమేమిటి? ప్రమాదం జరిగిన క్షణాన్ని స్పష్టంగా చూపే సీసీటీవీ దృశ్యాలు కానీ, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం కానీ ఉందా?
- ఫిర్యాదుదారు వాంగ్మూలంలో గందరగోళం
- ఎఫ్‌ఐఆర్‌లో బాధితురాలి నుంచి సేకరించిన సమాచారం ప్రకారమే సిద్ధార్థ్‌ను డ్రైవర్‌గా పేర్కొన్నారు.
- రిమాండ్ రిపోర్టులో మాత్రం అప్పలరాజు చెప్పడం వల్లే సిద్ధార్థ్ తానే డ్రైవర్‌నని తప్పుడు స్టేట్‌మెంట్ ఇచ్చాడని పోలీసులు ఆరోపిస్తున్నారు.
- ఈ రెండింటి మధ్య వైరుధ్యం ఏంటంటే.. ఫిర్యాదుదారుకు సిద్ధార్థ్ పేరు ఎలా తెలిసింది? ఆమె స్వయంగా గుర్తించి చెప్పిందా లేక మరెవరైనా చెప్పిన సమాచారంపై రాసిందా అనే అంశంపై స్పష్టత కొరవడింది.
- ఘటనాస్థలంలో అప్పలరాజు ఉన్నారన్న ఆరోపణ
- రిమాండ్ రిపోర్టులో ప్రమాదం జరిగిన వెంటనే అప్పలరాజు ఘటనాస్థలానికి చేరుకుని, అక్కడే తన కుమారుడిని రక్షించేందుకు కుట్ర పన్నారని పోలీసులు పేర్కొన్నారు.
- అప్పలరాజు స్పాట్‌కు వెళ్లారని నిరూపించే ఎలాంటి సీసీటీవీ దృశ్యాలు, మొబైల్ టవర్ లొకేషన్, కాల్ డేటా లేదా స్వతంత్ర సాక్ష్యాలను రిమాండ్ రిపోర్టులో ఎందుకు పొందుపరచలేదు?
- లెర్నర్స్ లైసెన్స్‌పై ద్వంద్వ వైఖరి
- రిమాండ్ రిపోర్టులో అరవ్‌వర్మకు 2026 జూలై 8నే లెర్నర్స్ లైసెన్స్ (LLR) జారీ అయినట్లు పోలీసులు అంగీకరించారు. అదే రిపోర్టులో ఆయన లైసెన్స్ లేకుండా వాహనం నడిపారని ఆరోపించారు.
- లెర్నర్స్ లైసెన్స్ ఉందంటూనే, అసలు లైసెన్సే లేదనడం వైరుధ్యం. LLR ఉన్నప్పుడు ఏ నిర్దిష్ట షరతును ఉల్లంఘించారో పోలీసులు స్పష్టం చేయలేదు.
- బైక్ సిద్ధార్థ్‌ది.. అనుమతి అప్పలరాజుదా?
- రిమాండ్ రిపోర్టులో ప్రమాదానికి గురైన బైక్ సిద్ధార్థ్‌కు చెందినదని, అతడే అరవ్‌వర్మకు ఇచ్చాడని చెప్తూనే, అప్పలరాజు సమక్షంలోనే ఇది జరిగిందని, ఆయనే కుమారుడిని బైక్ నడపడానికి అనుమతించారని ఆరోపించారు.
- బైక్ యజమాని వేరే వ్యక్తి అయినప్పుడు, అతడే బైక్ ఇచ్చినప్పుడు, అప్పలరాజు “అనుమతించారు” అని పోలీసులు ఏ ఆధారంతో నిశ్చయానికి వచ్చారు?
- సీసీటీవీ దృశ్యాలు ప్రయాణానివా? ప్రమాదానివా?
- రిమాండ్ రిపోర్టులో పెట్రోల్ బంక్, బజాజ్ షోరూమ్, ఆసుపత్రి, టోల్‌ప్లాజాల వద్ద ఉన్న సీసీటీవీ దృశ్యాలను పోలీసులు ఆధారాలుగా చూపారు.
- ఆ సీసీటీవీ దృశ్యాలు కేవలం వాహనాల ప్రయాణాన్ని లేదా వ్యక్తుల కదలికలను మాత్రమే చూపుతున్నాయి. పెట్రోల్ బంకు దృశ్యాలను ప్రమాద సమయ దృశ్యాలుగా ఎలా పరిగణిస్తారు? ప్రమాదం జరిగిన క్షణంలో ద్విచక్ర వాహనాన్ని ఎవరు నడిపారనే ప్రత్యక్ష దృశ్యాలు ఎక్కడ ఉన్నాయి?
- కుమారుడిని ఆసుపత్రికి తీసుకెళ్లడం ‘ఆశ్రయం కల్పించడమా’?
- రిమాండ్ రిపోర్టులో గాయపడిన తన కుమారుడిని అప్పలరాజు ఆసుపత్రికి తీసుకెళ్లడం, ఆ తర్వాత ప్రయాణించడాన్ని ‘చట్టం నుంచి నిందితుడిని రక్షించడానికి, ఆశ్రయం ఇవ్వడానికి చేసిన ప్రయత్నం’గా పేర్కొన్నారు.
- ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే.. ప్రమాదంలో గాయపడిన కన్న కొడుకును తండ్రిగా ఆసుపత్రికి తీసుకెళ్లడం నేరపూరిత కుట్ర ఎలా అవుతుంది?
- పోస్టుమార్టం నివేదికకు భిన్నమైన వాదనలు
- రిమాండ్ రిపోర్టు (పేజీ 1)లో ప్రమాదం జరిగిన వెంటనే బాధితుడు అక్కడికక్కడే మరణించాడని పేర్కొంది.
- రిమాండ్ రిపోర్టు (పేజీ 14)లో అదే రిపోర్టు 14వ పేజీలో అప్పలరాజు మృతుడిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి ఉంటే అతను బతికేవాడని పేర్కొంది.
- తక్షణమే మరణించిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్తే బతికేవాడని అనడం పరస్పర విరుద్ధం. దీనిపై మెడికల్ ఆఫీసర్ లేదా పోస్టుమార్టం నివేదిక ఏం చెబుతోందో వెల్లడించలేదు.
- పరిహారం వివాదం – లభించని ఆర్థిక ఆధారాలు
- రిమాండ్ రిపోర్టులో మృతుడి కుటుంబంతో రూ.8.50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని, రూ.1.50 లక్షలు చెల్లించారని ఆరోపించింది.
- ఇదే రిపోర్టులో ఈ ఆర్థిక లావాదేవీల మూలం, చెల్లింపు విధానం, పాల్గొన్న వ్యక్తుల వివరాలపై ఇంకా విచారణ జరపాల్సి ఉందని పోలీసులు స్వయంగా అంగీకరించారు. పూర్తి ఆధారాలు లేకుండానే అప్పలరాజు ప్రలోభపెట్టారని ఎలా ప్రాథమికంగా నిర్ధారిస్తారు?
- సంతకం లేని అంగీకార వాంగ్మూలం
- రిమాండ్ రిపోర్టులో అప్పలరాజు విచారణలో నేరాన్ని అంగీకరించారని పోలీసులు తెలిపారు. కానీ, మధ్యవర్తుల నివేదిక (మజహర్)పై ఆయన సంతకం చేయడానికి నిరాకరించారని పేర్కొన్నారు.
- ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే.. నిందితుడు సంతకం చేయని స్టేట్‌మెంట్‌కు చట్టబద్ధత ఏమిటి? దానికి మద్దతుగా ఎలాంటి డిజిటల్ లేదా సాంకేతిక ఆధారాలు చూపలేదు.
- ఆధారాల సేకరణ పూర్తికాకుండానే తీవ్రమైన ఆరోపణలు
- రిమాండ్ రిపోర్టులో మొబైల్ ఫోన్లు, కాల్ డేటా, డిజిటల్ కమ్యూనికేషన్లు, ఆర్థిక లావాదేవీలు వంటి కీలక ఆధారాలను ఇంకా సేకరించాల్సి ఉందని పోలీసులు నివేదికలో రాశారు.
- ఇక్కడ తేడా ఏంటంటే.. దర్యాప్తు ప్రారంభ దశలోనే ఉండి, సాంకేతిక ఆధారాలు ఇంకా సేకరించాల్సి ఉన్నప్పుడు అప్పలరాజుపై కుట్ర, హత్య ప్రోత్సాహకం వంటి తీవ్రమైన నిర్ధారణలకు రావడం సందేహాస్పదంగా మారింది.
- పాత కేసుల వివరాలు.. శిక్షల ప్రస్తావన శూన్యం
- రిమాండ్ రిపోర్టులో అప్పలరాజుపై గతంలో ఉన్న పలు క్రైమ్ నంబర్లను జాబితా చేసి ఆయన ప్రభావశీలుడని పేర్కొన్నారు.
- ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే.. ఆ కేసుల్లో ఏమైనా దోష నిర్ధారణ (Conviction) జరిగిందా? రాజకీయ ఆందోళనల సందర్భంగా నమోదైన కేసులను నేర చరిత్రగా చూపడం ఎంతవరకు సమంజసం?
- ఈ కేసులో తేలాల్సిన 5 కీలక ప్రశ్నలు
- ప్రమాద సమయంలో నిజంగా బైక్ నడిపింది ఎవరు సిద్ధార్థా, లేక అరవ్‌వర్మా?
- సాధారణ ప్రమాద కేసు (BNS 106(1))ని హత్యానేరం (BNS 105) గా మార్చడానికి లభించిన శాస్త్రీయ ఆధారం ఏమిటి?
- అప్పలరాజు ఘటనాస్థలంలో ఉండి కుట్ర పన్నారని నిరూపించే స్పష్టమైన సాక్ష్యాలు ఏవి?
- పోలీసులు స్వాధీనం చేసుకున్న సీసీటీవీ దృశ్యాలు ప్రయాణాలను మాత్రమే చూపుతున్నాయా, లేదా నేరాన్ని కూడా నిరూపిస్తున్నాయా?
- ఇంకా కీలక ఆధారాలు సేకరించాల్సి ఉందని చెప్తున్న పోలీసులు, ముందే అప్పలరాజును నిందితుడిగా చిత్రీకరించడం వెనుక అంతర్యం ఏమిటి?
సాధారణ రోడ్డు ప్రమాదంగా, సిద్ధార్థ్ డ్రైవర్‌గా నమోదైన కేసు క్రమంగా రూపుమార్చుకుని, అరవ్‌వర్మను ఏ-1గా, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ఏ-3గా చేర్చి హత్య, కుట్ర, సాక్ష్యాల మాయం వంటి తీవ్ర అభియోగాలతో కూడిన కేసుగా మారింది. న్యాయస్థానంలో విచారణ సాగుతున్న వేళ, పోలీసులు దాఖలు చేసిన ఆధారాల విశ్వసనీయతను, కేసు రూపురేఖలు మారిన కాలక్రమాన్ని చట్టపరిధిలో నిష్పక్షపాతంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని వైసీపీ డిమాండ్ చేస్తోంది.








