ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపాలిటీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీలతో సహా అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని సుప్రీంకోర్టు తుది ఆదేశాలు జారీ చేసింది. అక్టోబరు 27న సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించిన ఈ తీర్పు కాపీ తాజాగా బయటకు వచ్చింది. ఇందులో పలు కీలక అంశాలను దేశ సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది.
నామినేషన్ల స్వీకరణ కేంద్రాల నుంచి ఓట్ల లెక్కింపు వరకు ప్రతి ఘట్టాన్ని సీసీటీవీల కెమెరాల్లో, వీడియోగ్రఫీలో నిక్షిప్తం చేయాలని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులు రాష్ట్రవ్యాప్తంగా జరిగే అన్ని స్థానిక ఎన్నికలకు వర్తిస్తాయని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు, రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలు, పోలింగ్ బూత్‌లు, స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాలలో సీసీటీవీ/వీడియోగ్రఫీ కవరేజీని ఏర్పాటు చేయడం విధిగా పాటించాలని ఆదేశించింది.
ఒకవేళ ఏదైనా స్థానానికి సంబంధించి ఎన్నికల పిటిషన్ దాఖలైతే, ఆ కేసు న్యాయస్థానంలో లేదా ట్రిబ్యునల్‌లో తుది పరిష్కారం అయ్యే వరకు సంబంధించిన వీడియో ఆధారాలను నాశనం చేయకుండా దాచాల్సిందేనని స్పష్టం చేసింది.
ఎన్నికల పిటిషన్‌లో భాగస్వాములైన అభ్యర్థులు నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకుంటే వారికి సంబంధించిన వీడియో ఫుటేజీ ప్రతులను అందుబాటులో ఉంచాలని కోర్టు పేర్కొంది.
అభ్యర్థులు ఎలాంటి బెదిరింపులు, అడ్డంకులు లేకుండా స్వేచ్ఛగా వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పించేలా అవసరమైన చోట జిల్లా కేంద్రాల్లోనూ నామినేషన్ల దాఖలుకు వీలు కల్పించి, పూర్తిస్థాయి పోలీసు బందోబస్తును కల్పించాలని రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు ఇచ్చింది.








