‘ఇదేనా మీ సుపరిపాలన?’ గుంటూరు ఘటనపై జగన్ ఆగ్ర‌హం

‘ఇదేనా మీ సుపరిపాలన?’ గుంటూరు ఘటనపై జగన్ ఆగ్ర‌హం

Summarize with AI

గుంటూరులో ఒక మహిళను వివస్త్రను చేసి, టీడీపీ నేత అమానుషంగా దాడికి పాల్పడిన ఘటనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దారుణం మానవత్వానికే మచ్చ అని, రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ ఎంత ఘోరంగా విఫలమైందో చెప్పడానికి ఇది నిలువెత్తు నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు. ఈ మేరకు శనివారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చంద్రబాబు ప్ర‌భుత్వంపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు

వీడియోలు బయటకు వస్తేనే చట్టం మేల్కొంటుందా?
గుంటూరు కృష్ణబాబు కాలనీలో బుధవారం ఈ ఘోరం జరిగితే.. మూడు రోజులపాటు దాన్ని కప్పిపెట్టే ప్రయత్నం చేశారని వైఎస్ జగన్ ఆరోపించారు. “ఆ దారుణానికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో బయటకు వచ్చి, రాష్ట్ర ప్రజలంతా చూసి ఈ పరిపాలనను అసహ్యించుకున్న తర్వాత.. ఇప్పుడు తానేదో గొప్పగా చర్యలు తీసుకుంటున్నట్లు చంద్రబాబు హడావుడి చేయడం మరింత సిగ్గుచేటు” అని విమర్శించారు.

బుధవారమే తనపై తొలిసారే దాడి జరిగిన తర్వాత, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు వారు స్పందించి ఉండి ఉంటే ఆ తర్వాత ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదుకదా? అని ప్ర‌శ్నించారు. పోలీస్ స్టేషన్లు బాధితులకు అండగా ఉండాల్సింది పోయి, అధికార పార్టీ నేతల కోసం సెటిల్మెంట్ పంచాయితీలు చేస్తున్నాయా అని నిలదీశారు.

కూటమి ప్రభుత్వం తెచ్చిన ‘రెడ్‌బుక్ రాజ్యాంగం’ వల్లే రాష్ట్రం జంగిల్‌రాజ్‌గా మారిందని జగన్ ధ్వజమెత్తారు. పోలీసు వ్యవస్థను రాజకీయ ఆయుధంగా మార్చడం వల్లే.. తాము ఏం చేసినా కాపాడటానికి చంద్రబాబు ఉన్నారనే ధైర్యంతో టీడీపీ నేతలు దుశ్శాసనుల్లా తయారయ్యారని మండిపడ్డారు. “చంద్రబాబు గారూ… ఇదేనా మీరు చెప్పే మహిళా భద్రత, సుపరిపాలన? మహిళల ఆగ్రహమే మీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతుంది” అంటూ వైఎస్ జగన్ హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment