ఏలూరు జిల్లా నూజివీడులో తెలుగుదేశం పార్టీకి చెందిన దళిత సోషల్ మీడియా యాక్టివిస్ట్ ‘మంచోడు మణి’ పై జరిగిన హత్యాప్రయత్నం తీవ్ర కలకలం రేపుతోంది. సొంత పార్టీకి చెందిన మరో వర్గమే ఈ ఘాతుకానికి ఒడిగట్టిందనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన గంటల వ్యవధిలోనే ఈ దాడికి పాల్పడటం గమనార్హం. ఈ దాడి వెనుక మంత్రి లోకేష్ పీఏపై పోస్టులే కారణమని తెలుస్తోంది.
పార్టీ కోసం పనిచేసే సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లపైనే ఈ స్థాయిలో దాడులు జరగడం, అది కూడా దళిత వర్గానికి చెందిన వ్యక్తి కావడం పెద్ద రచ్చకు దారితీసింది. టీడీపీకి, మంత్రి లోకేష్ పీఏకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న మణి కదలికలపై దుండగులు గత మూడు రోజుల నుంచి రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి మణిని కారుతో వెంటాడి, వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు. మణి కిందపడిపోగానే కర్రలు, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. అంతటితో ఆగకుండా కిందపడి కదలలేని స్థితిలో ఉన్న మణి రెండు కాళ్ల పైనుంచి కారును తొక్కించేశారు. ఈ అమానుష దాడిలో మణి రెండు కాళ్లు విరిగిపోయాయి. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
సోషల్ మీడియాలో ‘మంచోడు మణి’ పేరుతో యాక్టివ్‌గా ఉండే మణి, గత కొద్దిరోజులుగా పార్టీలోని కొన్ని అంతర్గత విషయాలపై ఘాటుగా స్పందిస్తున్నట్లుగా అతని పోస్టుల ద్వారా అర్థమవుతోంది. దాడికి కొన్ని గంటల ముందే.. “చినబాబు టీమ్ నన్ను బెదిరిస్తే నేను భయపడను.. ఎదురుతిరిగి ఎదిరిస్తా” అంటూ చివరి పోస్టు పెట్టాడు. ఈ దాడి వెనుక పామర్రుకు చెందిన ఒక కీలక టీడీపీ మహిళా నేత హస్తం కూడా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఒక దళిత యువకుడిపై నడిరోడ్డుపై ఇంతటి అనాగరికమైన హత్యాయత్నం జరిగినా, పోలీసులు ఇప్పటివరకు కనీసం ఎఫ్‌ఐఆర్ (FIR) కూడా నమోదు చేయకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఈ దాడి వ్యవహారంలో చినబాబు పీఏ సాంబ పేరు గట్టిగా వినిపిస్తుండటంతో పోలీసులు కేసు నమోదు చేయడానికి వెనుకంజ వేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
నూజివీడుకు చెందిన కొందరు ముఖ్య టీడీపీ నేతలు రంగంలోకి దిగి.. బాధితుడి కుటుంబంతో మాట్లాడి భారీ ఆర్థిక ప్యాకేజీతో ఈ వ్యవహారాన్ని పోలీస్ స్టేషన్ బయటే సెటిల్మెంట్ చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు స్థానికంగా జోరుగా చర్చ సాగుతోంది.








