వైసీపీ (YSRCP) అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) రేపటి హైదరాబాద్ (Hyderabad) పర్యటనను రద్దు చేసుకున్నారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను (Mudragada Padmanabham) పరామర్శించేందుకు రేపు జగన్ హైదరాబాద్ వెళ్లాల్సి ఉండగా, ముద్రగడ కుటుంబం చేసిన విజ్ఞప్తి మేరకు పర్యటనను రద్దు చేసినట్లు ఆయన కుమారుడు ముద్రగడ గిరి వెల్లడించారు.
ఈ సందర్భంగా ముద్రగడ గిరి (Mudragada Giri) మాట్లాడుతూ.. తన తండ్రి ముద్రగడ పద్మనాభం అనారోగ్య సమస్య నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నారని తెలిపారు. ప్రజలందరి ఆశీస్సులతో ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని చెప్పారు. తండ్రి అనారోగ్యానికి గురైనప్పటి నుంచి మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రతిరోజూ వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారని గిరి వెల్లడించారు. అందుతున్న వైద్యం గురించి వైద్యులతో నేరుగా మాట్లాడుతున్నారని, సింధూ హాస్పిటల్ యజమాని బండి పార్ధసారధి రెడ్డితో (Bandi Parthasaradhi Reddy) వ్యక్తిగతంగా మాట్లాడి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారని తెలిపారు.
అలాగే ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు (Nori Dattatreyudu) కూడా తన తండ్రి ఆరోగ్యం, చికిత్సకు అవసరమైన సహకారం అందించారని గిరి పేర్కొన్నారు. వైఎస్ జగన్ (Ys Jagan) తమ కుటుంబానికి అండగా నిలుస్తూ చేస్తున్న సహాయాన్ని ఎప్పటికీ మరిచిపోలేమని, ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని గిరి అన్నారు. జగన్ హైదరాబాద్‌కు వస్తున్నారని తెలిసిన వెంటనే తామే ఆయనకు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలిపారు. ప్రస్తుతం తన తండ్రితో పాటు ఐసీయూలో మరికొందరు రోగులు చికిత్స పొందుతున్నారని, ప్రజాదరణ కలిగిన నాయకుడి వెంట వేల సంఖ్యలో అభిమానులు తరలివచ్చే అవకాశం ఉంటుంది కాబట్టే రావద్దని తామే కోరామని చెప్పారు.
తండ్రి పూర్తిగా కోలుకున్న తర్వాత తామే వెళ్లి జగన్‌ను కలుస్తామని, లేకపోతే జగన్ తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు కిర్లంపూడికి వస్తే సరిపోతుందని చెప్పినట్లు గిరి వెల్లడించారు. తన తండ్రికి వైఎస్ జగన్ చేసిన సాయాన్ని జీవితాంతం మరిచిపోలేమని, తమ కుటుంబం ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటుందని ముద్రగడ గిరి మరోసారి స్పష్టం చేశారు.
మా నాన్న ముద్రగడ పద్మనాభం నెమ్మదిగా కోలుకుంటున్నారు
— Telugu Feed (@Telugufeedsite) July 1, 2026
జగన్ ప్రత్యేక చొరవ తీసుకుని. ఎప్పటికప్పుడు వైద్యులతో మాట్లాడి నాన్న ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నారు
ఈ క్లిష్ట సమయంలో మా కుటుంబానికి అండగా నిలబడిన జగన్ కి ఎప్పటికీ రుణపడి ఉంటాం
– ముద్రగడ గిరిబాబు pic.twitter.com/oZeoH1idx6








