విశాఖపట్నంలో(Visakhapatnam) జరిగిన ఓ రేవ్ పార్టీ (Rave Party) వ్యవహారం రాజకీయంగా, పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జబర్దస్త్ ఫేమ్, నటి పుట్టినరోజు వేడుకల పేరుతో రిసార్ట్‌లో నిర్వహించిన పార్టీలో టీడీపీ(TDP), టీఎన్‌ఎస్‌ఎఫ్ (TNSF) నేతలు పాల్గొన్నట్టు సమాచారం. పార్టీలో మహిళల విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తడంతో ఘర్షణకు దారితీసిందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఓ టీడీపీ నేత మరో నేతపై కత్తితో దాడి చేయడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు.
ఆనందపురం మండలంలోని హ్యాపీ నేచర్ రిసార్ట్స్‌లో(Happy Nature Resorts) మంగళవారం రాత్రి జబర్దస్త్ నటి(Jabardasth Actress) పుట్టినరోజు వేడుకల పేరుతో పార్టీ నిర్వహించారు. ఈ వేడుకలకు సుమారు 70 మంది వరకు హాజరయ్యారు. టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు రత్నకాంత్(Ratnakanth), టీడీపీ నేత బొండా రవికుమార్(Bonda Ravikumar), పలువురు టీడీపీ, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, మహిళా నేతలు పాల్గొన్నట్లు సమాచారం.
పార్టీలో మహిళల విషయంలో కొందరి మధ్య వివాదం తలెత్తడంతో రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో రిసార్ట్ నిర్వహిస్తున్న టీడీపీ నేత మమ్ముల వెంకట దినేష్‌పై (Mammula Venkata Dinesh) యర్రా చరణ్ తేజ్(Yarra Charan Tej) కత్తితో దాడి (Knife Attack) చేశాడు. కత్తి దాడిలో వెంకట దినేష్ ఎడమ భుజం వెనుక భాగంలో తీవ్ర గాయమైంది. వెంటనే అతడిని విశాఖలోని విమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
ఆసుపత్రిలో మెడికో లీగల్ కేసు (ఎంఎల్‌సీ)(MLC)గా నమోదు కావడంతో ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. యర్రా చరణ్ తేజ్‌పై(Yarra Charan Tej) హత్యాయత్నం కేసు నమోదు చేసి, అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఘటన తెల్లవారుజామున జరిగినప్పటికీ పోలీసులు ఆలస్యంగా స్పందించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అధికార పార్టీకి చెందిన నేతలు పార్టీలో పాల్గొన్న నేపథ్యంలో ఘటనను చిన్నదిగా చూపించేందుకు, ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నాలు జరిగాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. పొరపాటున కత్తి తగిలి గాయమైందని చెప్పి కేసు నమోదు కాకుండా చూసేందుకు పోలీసులపై ఒత్తిళ్లు వచ్చినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆసుపత్రిలో ఎంఎల్‌సీ నమోదు కావడంతో పోలీసులు కేసు నమోదు చేయాల్సి వచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఘటన జరిగిన రిసార్ట్ టీడీపీకి(TDP) చెందిన మజ్జి శేఖర్‌కు (Majji Shekhar) సంబంధించినదిగా సమాచారం. ఘటన అనంతరం రిసార్ట్‌ను మూసివేసినట్లు తెలుస్తోంది. పార్టీకి సంబంధించిన వివరాలు బయటకు రాకుండా సీసీటీవీ ఫుటేజీని మాయం చేశారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
పార్టీలో పెద్ద మొత్తంలో విదేశీ మద్యం వినియోగించినట్లు సమాచారం. దీంతో వేడుకలకు ఎలాంటి అనుమతులు తీసుకున్నారు? మద్యం వినియోగానికి అనుమతులు ఉన్నాయా? పార్టీలో నిషేధిత మాదకద్రవ్యాలు వినియోగించారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగం జరిగిందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. రేవ్ పార్టీలో జరిగిన కత్తి దాడి ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది.








