తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా సురేఖ ఎపిసోడ్ నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేడెక్కుతున్న వేళ.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసినట్లు తెలిపారు.
హైదరాబాద్ ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తాను ఎప్పుడూ వ్యక్తిగత విమర్శలు చేయలేదని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. తెలంగాణ కోసం తాను ఉద్యమించిన వ్యక్తినని, ఎంపీగా, ఎమ్మెల్యేగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడినట్లు గుర్తుచేశారు.
తెలంగాణ ఏర్పాటులో ఎలాంటి భాగస్వామ్యం లేని కొందరు ఇప్పుడు తెలంగాణ ఉద్యమ నాయకులపై విమర్శలు చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. తనపై విమర్శలు చేసేవారు ముందుగా తమ స్థాయి ఏమిటో గుర్తు చేసుకోవాలని అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ నాయకత్వాన్ని తొక్కివేసే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. కొందరు వలస కాంగ్రెస్ నాయకులకు కొన్ని మీడియా సంస్థలు సహకరిస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో లేని వ్యక్తులు ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉండొచ్చని.. కానీ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన నాయకులను విమర్శించడం సరికాదని అన్నారు.
కొండా సుస్మిత పటేల్ వ్యాఖ్యల అంశాన్ని ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఈ వ్యవహారంపై పార్టీ అధిష్ఠానం తగిన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. తనలాంటి తెలంగాణ ఉద్యమ నాయకులను విమర్శిస్తే తెలంగాణ సమాజం ఊరుకోదని ఆయన హెచ్చరించారు. కొందరి స్వలాభం కోసం తెలంగాణ నేతలపై తప్పుడు కథనాలు, రాతలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ నేతలను ఉద్దేశించి ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తే తాము చూస్తూ ఊరుకోబోమని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఎవరు పోరాడారు, ఎవరు ఏ పాత్ర పోషించారు అనే విషయం ప్రజలకు తెలుసని అన్నారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న అంతర్గత రాజకీయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.








