తమిళనాడు(Tamil Nadu) ఆర్థిక పరిస్థితిపై (Financial Situation) కొత్త ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం (White Paper) రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నివేదికలో వెల్లడించిన వివరాలు ఆందోళన కలిగించేలా ఉన్నాయి. ప్రస్తుతం తమిళనాడులో జన్మించే ప్రతి బిడ్డపై (Newborn Child) సగటున రూ.1.28 లక్షల అప్పు భారం ఉందని ప్రభుత్వం పేర్కొంది. ఐదేళ్ల క్రితం సుమారు రూ.4.8 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర అప్పు ఇప్పుడు దాదాపు రూ.10 లక్షల కోట్లకు చేరుకోగా, ప్రభుత్వ హామీలు (Government Guarantees) మరియు ఇతర బాధ్యతలను కలుపుకుంటే మొత్తం ఆర్థిక భారం రూ.13.18 లక్షల కోట్లకు పెరిగినట్లు వెల్లడించింది.
గత ఐదేళ్లలో తీసుకున్న రుణాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపినట్లు శ్వేతపత్రం పేర్కొంది. ముఖ్యంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి కాకుండా, రోజువారీ పరిపాలనా ఖర్చుల నిర్వహణకే అధికంగా అప్పు నిధులు వినియోగించబడ్డాయని ఆర్థిక శాఖ అభిప్రాయపడింది. ప్రస్తుతం ప్రభుత్వానికి వచ్చే ప్రతి రూపాయిలో దాదాపు 23 పైసలు పాత రుణాల వడ్డీ చెల్లింపులకే వెళ్తుండటం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. ఇదే సమయంలో రాష్ట్ర ఆర్థిక లోటు (State Fiscal Deficit) కూడా గణనీయంగా పెరిగినట్లు నివేదిక వెల్లడించింది.
ఇక ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడుపై రుణభారం ఎక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈ ఆరోపణలను ప్రతిపక్షం ఖండిస్తూ, రాష్ట్ర అప్పులు చట్టబద్ధ పరిమితుల్లోనే ఉన్నాయని స్పష్టం చేసింది. శ్వేతపత్రం విడుదలతో తమిళనాడు ఆర్థిక నిర్వహణ, పెరుగుతున్న అప్పులు, భవిష్యత్ సంస్కరణలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ ప్రారంభమైంది. రాబోయే రోజుల్లో ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో మరింత ప్రాధాన్యం సంతరించుకునే అవకాశం కనిపిస్తోంది.








