విశాఖ ఏజెన్సీ (Visakha Agency) మన్యంలో మళ్లీ బాక్సైట్ (Bauxite) భూతం పడగవిప్పుతోందా..? అటవీ సంపదపై, గిరిజనుల గుండెకాయ లాంటి కొండలపై కార్పొరేట్ కన్ను పడిందా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అల్లూరి జిల్లా చింతపల్లి మండలం జెర్రెల (Jerrela) పరిధిలోని బాక్సైట్ కొండలపై మళ్లీ సర్వేల పేరిట కదలికలు రావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
కూటమి పాలనలో (Coalition Government) బాక్సైట్ తవ్వకాల (Bauxite Mining) కోసం తెరవెనుక అడుగులు పడుతున్నాయనే అనుమానాలకు బలంచేకూరుస్తూ.. జెర్రెల కొండలపై అనుమానాస్పదంగా సర్వే చేస్తున్న కొందరు యువకులను (Youth) గిరిజనులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం ఏజెన్సీలో తీవ్ర ఉత్కంఠకు దారితీసింది.
జెర్రెల బాక్సైట్ కొండలపై రెండు బృందాలుగా విడిపోయిన కొందరు యువకులు రహస్యంగా సర్వే నిర్వహిస్తూ, మట్టి నమూనాలను (Soil Samples) సేకరిస్తుండటాన్ని స్థానిక గిరిజనులు గమనించారు. “అసలు మిమ్మల్ని ఇక్కడికి ఎవరు పంపించారు? బాక్సైట్ కొండలపై సర్వే చేయడానికి మీకెవరు అనుమతి ఇచ్చారు?” అని గిరిజనులు వారిని నిలదీశారు. యువకులు నీళ్లు నమలడంతో అనుమానంతో వారిని పట్టుకుని చింతపల్లి పోలీసులకు అప్పగించారు.
బాక్సైట్ తవ్వకాల కోసమే ఈ నిశ్శబ్ద సర్వేలు జరుగుతున్నాయని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. అయితే, ఈ యువకులు ఎవరి తరపున వచ్చారు, వీరి వెనుక ఉన్న శక్తులు ఎవరనేది ఇంకా పోలీసు విచారణలో తేలాల్సి ఉంది.
జెర్రెల కొండలపై బాక్సైట్ పేరుతో జరుగుతున్న సర్వేలపై స్థానిక వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు (Visweswara Raju) తీవ్రంగా స్పందించారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల (Tribal Communities) హక్కులను కాలరాస్తూ, పర్యావరణాన్ని ధ్వంసం చేసే బాక్సైట్ తవ్వకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఆయన తేల్చి చెప్పారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బాక్సైట్ తవ్వకాలు జరపొద్దని వైఎస్ జగన్ (Y. S. Jagan Mohan Reddy) ఆర్డర్లు ఇచ్చారు. తవ్వకాలు రద్దు చేసి అటవీ సంపదను, గిరిజనుల ప్రయోజనాలను కాపాడారని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. కానీ, ప్రస్తుతం మళ్లీ బాక్సైట్ కొండలపై ఆశావహుల కన్ను పడటం గిరిజన ప్రాంతాల్లో అలజడి రేపుతోంది.
గతంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా మన్యం సుదీర్ఘ పోరాటాలు చేసింది. ప్రాణాలనైనా ఇస్తాం కానీ కొండలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించబోమని గిరిజనులు తెగేసి చెబుతున్నారు. కూటమి ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతోనే ఈ తరహా సర్వేలు జరుగుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం స్పందించి ఈ రహస్య సర్వేల వెనుక ఉన్న అసలు సూత్రధారులను బయటపెట్టాలని, లేనిపక్షంలో ఏజెన్సీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని గిరిజన, ప్రజా సంఘాలు హెచ్చరిస్తున్నాయి.









అర్ష్దీప్-సమ్రీన్ రిలేషన్.. వైరల్ అవుతున్న ఇన్స్టా ఎమోజీలు!