ఇంగ్లండ్‌తో (England) జరిగే రెండో టీ20 (T20) మ్యాచ్‌కు ముందు టీమిండియా (Team India) పూర్తి ఫోకస్‌తో ప్రాక్టీస్‌లో మునిగిపోయింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సోషల్ మీడియాలో షేర్ చేసిన తాజా ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. “ఫోకస్ 100%, ఎనర్జీ పీక్స్” (Energy Peaks) అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ చిత్రాల్లో భారత బ్యాటర్లు నెట్స్‌లో షాట్లతో అలరిస్తూ, మ్యాచ్‌కు అవసరమైన సన్నాహకాల్లో నిమగ్నమైనట్లు కనిపిస్తున్నారు. ఆటగాళ్లలో ఉత్సాహం, ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపిస్తుండటంతో ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తొలి టీ20లో విజయంతో జోష్‌లో ఉన్న టీమిండియా, రెండో మ్యాచ్‌లోనూ అదే దూకుడును కొనసాగించి సిరీస్‌పై పట్టు బిగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా సాధన చేస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంగ్లండ్ గడ్డపై మరోసారి భారత జట్టు సత్తా చాటుతుందా? బ్యాటర్లు మరోసారి పరుగుల వర్షం కురిపిస్తారా? అనే ఆసక్తి ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో నెలకొంది.









