ప్రపంచానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని కూటమి పెద్దలు చెబుతున్న అమరావతి (Amaravati) రాజధాని అభివృద్ధిపై టీడీపీ ఎమ్మెల్యే (TDP MLA) కుండబద్ధలు కొట్టారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) శాసనసభలో(Assembly) రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాల దుస్థితిపై తాడికొండ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్‌కుమార్ (Tenali Sravan Kumar) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాజధాని గ్రామాల్లో నెలకొన్న కనీస వసతుల లేమి, తాగునీటి ఇబ్బందులు, రవాణా సమస్యలను ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు.
అమరావతి రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో నివసించే ప్రజలు కనీస సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు. రాజధానిలో కేవలం భూసమీకరణలో(Land Pooling) భాగంగా రైతులు (Farmers) ఇచ్చిన భూముల్లో ఏర్పాటు చేసిన లేఅవుట్లకు మాత్రమే అభివృద్ధి జరుగుతోందని, కానీ ఏళ్ల తరబడి అక్కడే నివాసం ఉంటున్న స్థానిక గ్రామస్తులకు మాత్రం ఎలాంటి మౌలిక వసతులు అందడం లేదని తెలిపారు.
రాజధాని గ్రామాల్లో తాగునీటి సరవ్యవస్థ (Drinking Water Supply System) పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని, ప్రస్తుతం 3 నుంచి 4 రోజులకు ఒకసారి మాత్రమే తాగునీరు వస్తోందని సభలో ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో సరైన ట్రంక్ రోడ్లు (Trunk Roads) లేకపోవడం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని చెప్పారు. అత్యంత కీలకమైన శాసనసభ (Assembly), సచివాలయం (Secretariat) ఉన్న వెంకటపాలెం గ్రామానికి సైతం సరైన రవాణా కనెక్టివిటీ లేకుండా పోయిందని ఆయన సభ దృష్టికి తెచ్చారు.
గ్రామాల్లో నివసించే సాధారణ ప్రజల ఇబ్బట్లు తొలగిపోవాలంటే, రాజధాని మాస్టర్ ప్లాన్ పరిధిలోని ప్రతి గ్రామాన్ని సమానంగా అభివృద్ధి చేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. అయితే ప్రభుత్వ పెద్దలు చెబుతున్న అభివృద్ధి రాజధాని ప్రాంతంలో కనిపించకపోవడాన్ని స్వయంగా టీడీపీ ఎమ్మెల్యే బయటపెట్టడం సంచలనంగా మారింది.








