రెండు ల‌క్ష‌ల పుస్త‌కాల్లో నేర్చుకున్న‌ నీతి ఇదేనా..?

రెండు ల‌క్ష‌ల పుస్త‌కాల్లో నేర్చుకున్న‌ నీతి ఇదేనా..?

Summarize with AI

ఎన్నిక‌ల స‌మ‌యంలో సుగాలి ప్రీతి కేసు (Sugali Preethi Case) గురించి ప్ర‌తి వేదిక‌పై బీక‌ర స్లోగ‌న్లు ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ (Pawan Kalyan).. అధికారంలోకి వ‌చ్చిన రెండేళ్ల‌లో ఆ కేసు ఎప్పుడు జ‌రిగిందో, అప్పుడు అధికారంలో ఎవ‌రున్నారో కూడా మ‌రిచిపోయారు. కర్నూలు జిల్లాకు చెందిన విద్యార్థిని సుగాలి ప్రీతి మరణం కేసు మరోసారి ఏపీ(AP) రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సుగాలి ప్రీతి కేసులో సాక్ష్యాలను వైసీపీ(YSRCP) హయాంలో ధ్వంసం చేశారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అయితే, ఇక్కడే పవన్ కళ్యాణ్ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బాధితురాలి తల్లి సుగాలి పార్వతి (Parvathi) సైతం పవన్ కళ్యాణ్ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.

సుగాలి ప్రీతి కేసు జరిగింది 2017లో.. కానీ, ప‌వ‌న్ 2018లో జ‌రిగింద‌ని చెబుతున్నారు. 2017 సమయంలో రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం (TDP Government) అధికారంలో ఉంది. 2019 ఎన్నికల వరకు చంద్రబాబు నాయుడే(Nara Chandrababu Naidu) ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఘటన జరిగిన సమయంలోనే ప్రాథమిక సాక్ష్యాధారాల సేకరణ, పోస్ట్‌మార్టం, పోలీస్ విచారణ జ‌రిగింది. కట్టమంచి రామలింగారెడ్డి (Kattamanchi Ramalinga Reddy) రెసిడెన్షియల్ స్కూల్‌ (Residential School) కరస్పాండెంట్, ఆయన కుమారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కొద్ది రోజులకే వారు బెయిల్‌పై బయటకు వచ్చేశారు. మరి అలాంటప్పుడు సాక్ష్యాలు 2019 తర్వాత వచ్చిన వైసీపీ హయాంలో ఎలా ధ్వంసమయ్యాయో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణే సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.

అయితే 2019 ఎన్నిక‌ల్లో, ఆ త‌రువాత ప‌లు ద‌ఫాలుగా, 2024 ఎన్నిక‌ల్లోనూ ఈ కేసు గురించి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌(Pawan Kalyan) విప‌రీతంగా ప్ర‌చారం చేసుకున్నారు. త‌న వ‌ల్లే ఆ కుటుంబానికి న్యాయం జ‌రుగుతుంద‌నే ఒక ర‌క‌మైన‌ భ్ర‌మను అంద‌రినీలోనూ క‌ల్పించారు. తీరా అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా నిందితులపై చర్యలు తీసుకోకపోగా.. ఇప్పుడు “ఆధారాలు లేవు, ఏమీ చేయలేం” అని మాట్లాడటంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. పోలీసులు సమర్పించిన ఛార్జిషీటులో సాక్ష్యాలు ఉంటాయి క‌దా.. అప్ప‌టి వ‌ర‌కు ట్ర‌య‌ల్ జ‌రిగిన కేసులో సాక్ష్యాల‌ను ఎవ‌రు చెరిపేస్తారని ప్ర‌శ్నిస్తున్నారు. కాగా, త‌న కుమార్తె కేసును ప‌ట్టించుకోక‌పోగా, క‌నీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వ‌డం లేద‌ని సుగాలి ప్రీతి త‌ల్లి క‌న్నీరు పెట్టుకోవ‌డం సంచ‌ల‌నంగా మారింది.

గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Ys Jagan Mohan Reddy) ప్రభుత్వ హయాంలోనే సుగాలి ప్రీతి కేసును సీబీఐకి(CBI) అప్ప‌గిస్తూ ఆర్డ‌ర్స్ పాస్ చేశారు. ఈ కేసు విచారించాల‌ని సీఎం జ‌గ‌న్ సీబీఐకి లేఖ సైతం రాశారు. అంతేకాకుండా సుగాలి ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం తరఫున పెద్ద ఎత్తున సహాయం అందించారు. రూ.8 ల‌క్ష‌ల సాయం, కర్నూలు నగరంలో 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయించడంతో పాటు, ఆమె తండ్రి రాజు నాయక్‌కు ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పించారు.

అయితే, జగన్ హయాంలో జరిగిన ఈ సహాయాన్ని కూడా పవన్ కళ్యాణ్ తన ఖాతాలో వేసుకోవాలని చూడటంపై విమర్శలు వస్తున్నాయి. తన పోరాటం వల్లే ఆ కుటుంబానికి న్యాయం జరిగిందని, త‌న పోరాటం వ‌ల్లే వైసీపీ ప్ర‌భుత్వంలో భూములు, ఉద్యోగం వ‌చ్చాయ‌ని పవన్ చెప్పుకుంటున్నారు. మరి అధికారంలో ఉండి ఇప్పటివరకు పవన్ ఆ కుటుంబానికి చేసిన మేలు ఏంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ కుటుంబాన్ని కనీసం పట్టించుకోకపోవడంతో ప్రీతి తల్లి సుగాలి పార్వతి మళ్లీ జగన్ ను కలిసి తన గోడు వెల్లబోసుకుంది.

జగన్ హయాంలో ఈ కేసును సీబీఐకి ఇవ్వలేదని పవన్ అనడంపై రాజకీయ వర్గాలు మండిపడుతున్నాయి. నిజానికి, జగన్ ప్రభుత్వం సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్ప‌గించింది. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌రువాత సిబ్బంది కొరత, పెండింగ్ కేసుల భారం వల్ల తాము ఈ కేసును తీసుకోలేమని సీబీఐ కోర్టుకు తెలిపింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సీబీఐ విచారణ ముందుకు సాగకపోగా, ఇప్పుడు ‘సాక్ష్యాలు లేవు’ అంటూ కేసును పక్కనబెట్టేలా మాట్లాడటం పవన్ కళ్యాణ్ అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమని ధ్వజమెత్తుతున్నారు. ఒక‌వేళ ధ్వంసం చేసినట్లు ఆధారాలు ఉంటే వారిపై చర్యలు తీసుకోవచ్చు కదా.. అని ప్ర‌శ్నిస్తున్నారు.

లక్షల పుస్తకాలు చదివానని చెప్పుకునే పవన్ కళ్యాణ్‌కు, కేసు ఏ సంవత్సరంలో జరిగిందో, అప్పుడు అధికారంలో ఏ ప్రభుత్వం ఉందో కూడా తెలియకపోవడం ఆయన కనీస నాలెడ్జ్ లేమిని చూపిస్తోందని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. అధికారంలోకి వస్తే మొదటి కేసుగా విచారించి న్యాయం చేస్తానని మాట ఇచ్చిన పవన్ కల్యాణ్.. బాధ్యతాయుతమైన ఉపముఖ్యమంత్రి పదవిలో ఉండి ఇప్పుడు బాధితులనే నిరాశకు గురిచేసేలా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment