ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరోసారి తన సత్తా చాటాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 80 పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చిన గిల్, 12 రేటింగ్ పాయింట్లు సంపాదించి నంబర్-1 స్థానానికి మరింత చేరువయ్యాడు. ప్రస్తుతం 803 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న గిల్.. అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్‌కు కేవలం 11 పాయింట్ల దూరంలో మాత్రమే ఉన్నాడు. ఇదే సమయంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు తొలి వన్డేలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో ర్యాంకింగ్స్‌లో వెనుకబడ్డారు. కోహ్లీ మూడో స్థానానికి, రోహిత్ నాలుగో స్థానానికి పరిమితమవడం అభిమానులను నిరాశకు గురిచేసింది.
మరోవైపు ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ తన అద్భుత ప్రదర్శనతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారీ జంప్ చేశాడు. తొలి వన్డేలో నాలుగు వికెట్లు పడగొట్టడమే కాకుండా, ఒత్తిడిలో అజేయంగా 57 పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్న అక్షర్.. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్‌రౌండర్ మూడు విభాగాల్లోనూ ర్యాంకింగ్స్ మెరుగుపర్చుకున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో టాప్-10లోకి దూసుకెళ్లి 9వ స్థానాన్ని దక్కించుకోగా, వాషింగ్టన్ సుందర్ కూడా మంచి ప్రదర్శనతో ముందంజ వేశాడు. సుదీర్ఘ విరామం తర్వాత వన్డేల్లోకి తిరిగి వచ్చిన జస్ప్రీత్ బుమ్రా కూడా బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో 24వ స్థానానికి చేరుకోవడంతో టీమిండియా ఆటగాళ్ల ఆధిపత్యం మరోసారి స్పష్టమైంది.








