‘సాయికృష్ణ కేసు ప‌క్క‌దారికి ఒత్తిళ్లు’.. విజ‌య‌ల‌క్ష్మి చెల్లి సంచలన కామెంట్స్

'సాయికృష్ణ కేసు ప‌క్క‌దారికి ఒత్తిళ్లు'.. విజ‌య‌ల‌క్ష్మి చెల్లి సంచలన కామెంట్స్

Summarize with AI

సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో సాయికృష్ణ పిన్ని, అడ్వకేట్ కనకదుర్గ మీడియా ముఖంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు, బాధితులపై తీవ్ర ఒత్తిళ్లు తీసుకువచ్చేందుకు తెరవెనుక పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు.

ఈ కేసు విచారణకు సంబంధించి అధికారుల వైఖరిని కనకదుర్గ తీవ్రంగా తప్పుపట్టారు. “కేసులో సిబిఐ దర్యాప్తు వద్దు, జుడీషియల్ ఎంక్వైరీ కూడా వద్దు అని కొందరు అంటున్నారు. సిట్ (SIT) ఏం చేస్తుందో మేము చూస్తాం.. ప్రభుత్వం ఏం చేస్తుందో చూస్తాం.. మేము చెప్పింది మాత్రమే వినండి అంటూ ఒత్తిడి తెస్తున్నారు” అని ఆమె మండిపడ్డారు. బాధితులం అయిన తాము సామాన్యులమని, అందుకే అధికారులు ఏం చెప్పమంటే అది చెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఈ కేసు విషయంలో వెనకడుగు వేయడం వెనుక తీవ్రమైన ఒత్తిళ్లు ఉన్నాయని కనకదుర్గ అనుమానం వ్యక్తం చేశారు.

“విజయలక్ష్మికి ఒత్తిళ్లు ఉన్నాయి, బహుశా అందుకే ఆమె మానవ హక్కుల కమిటీ విచారణ వద్దంటూ కోర్టుకు తెలిపింది. కనీసం లాయర్‌గా ఉన్న నాకు కూడా చెప్పకుండా ఆమె నేరుగా కోర్టుకు వెళ్లారు. ఆ ఒత్తిళ్ల వల్లే అడ్వకేట్లను కూడా మార్చుకుంది. సాయికృష్ణ తల్లిని కోర్టుకు తీసుకురావడానికి కూడా పెద్ద హైడ్రామా నడిపించారు. ఈ హైడ్రామా ఎవరు నడిపించారు? ఆమె వెనుక ఎవరు ఉండి నడిపిస్తున్నారో మాకు అర్థం కావడం లేదు” అని ఆమె ఆరోపించారు.

బాధిత కుటుంబంలో భేదాభిప్రాయాలు కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, తాను మాత్రం న్యాయం జరిగే వరకు పోరాడతానని కనకదుర్గ స్పష్టం చేశారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి కేసు నుంచి తప్పుకున్నా, వెనకడుగు వేసినా సరే… తాను న్యాయ పోరాటం కొనసాగిస్తానని తేల్చి చెప్పారు. మా అక్క విజయలక్ష్మి పోరాటం చేయకపోయినా, సాయికృష్ణకు పిన్నిగా తాను మానవ హక్కుల కమిటీ తరపున న్యాయం కోసం చివరి వరకు పోరాడతానని కనకదుర్గ సంచలన ప్రకటన చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment