హైదరాబాద్లోని మాదాపూర్లో ప్రేమ వేధింపుల ఆరోపణల నేపథ్యంలో జరిగిన దారుణ హత్య కలకలం రేపింది. రామేశ్వరం కేఫే సమీపంలో భాస్కర్ అనే యువకుడిపై ఇద్దరు వ్యక్తులు కత్తులు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం, భాస్కర్ కొంతకాలంగా ఇద్దరు యువతులను వేధిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై గతంలో మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదవగా, పోలీసులు ఇరు పక్షాలకు కౌన్సెలింగ్ నిర్వహించినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదని తెలుస్తోంది.
ఇటీవల భాస్కర్ “దమ్ముంటే హైదరాబాద్కు రండి” అంటూ సవాల్ విసిరినట్లు సమాచారం. దీంతో ఆగ్రహానికి గురైన యువతుల్లో ఒకరి తండ్రి, మరో వ్యక్తితో కలిసి వరంగల్ నుంచి హైదరాబాద్కు వచ్చి దాడికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటన అనంతరం నిందితులిద్దరూ స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రేమ వేధింపుల ఆరోపణలే ఈ హత్యకు కారణమా, లేక ఇతర వ్యక్తిగత విభేదాలు కూడా ఉన్నాయా అనే కోణంలో అన్ని అంశాలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తులో వెలుగులోకి రావాల్సి ఉంది.








