కరీంనగర్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు. ఉద్యమం పేరుతో ఉమ్మడి కరీంనగర్, పాలమూరు ప్రజలను కేసీఆర్ వాడుకుని వదిలేశారని ఆరోపించారు. అమెరికా నుంచి వచ్చిన కేటీఆర్‌ను ఉద్దేశించి ఆయన ఘాటు ప్రశ్నలు సంధించారు. గల్ఫ్ దేశాల్లో తెలంగాణ కార్మికులు ఎడారుల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కుటుంబాలను పోషించుకుంటుంటే.. కేసీఆర్ కుటుంబానికి వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్ని బాత్‌రూమ్‌లు శుభ్రం చేస్తే, ఎన్ని చిప్పలు కడిగితే లక్ష కోట్ల సంపద వస్తుందని ప్రశ్నించారు. ఈ సంపదపై తెలంగాణ సమాజానికి కేసీఆర్ కుటుంబం వివరణ ఇవ్వాలని రేవంత్ రెడ్డి అన్నారు.
కేసీఆర్ రాజకీయ ప్రస్థానాన్ని ప్రస్తావించిన సీఎం.. 2004లో మెదక్ నుంచి కరీంనగర్‌కు వచ్చిన కేసీఆర్‌ను అక్కడి ప్రజలు మూడుసార్లు ఎంపీగా గెలిపించారని, అనంతరం ప్రజలను మోసం చేసి పాలమూరుకు వెళ్లారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని కేటీఆర్‌ను సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా చేశారని ఆరోపించారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో సిరిసిల్ల అభివృద్ధి చెందక ‘ఉరిసిల్ల’గా మారిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గల్ఫ్‌లో ప్రమాదవశాత్తు మరణించే కార్మికుల మృతదేహాలను స్వదేశానికి తీసుకురావడంతో పాటు, వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించే సంక్షేమ పథకాన్ని అమలు చేస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. కరీంనగర్, పాలమూరు ప్రజల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ తాకట్టు పెట్టారని ఆయన ఆరోపించారు.








