తమిళనాడులోని మదురై సమీపంలో ఉన్న ప్రసిద్ధ తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే విషయంలో ఏర్పడిన వివాదంపై ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పింది. సర్వోన్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, నిర్దేశిత ప్రదేశంలో దీపాన్ని వెలిగించలేకపోయామని ప్రభుత్వం కోర్టుకు నివేదించింది.
అసలేం జరిగింది?
తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న ‘దీపతూణ్’ (రాతి స్తంభం) వద్ద నవంబర్ 24న కార్తీక పౌర్ణమి సందర్భంగా ఒకసారి దీపం వెలిగించేందుకు నవంబర్ 20న సుప్రీంకోర్టు షరతులతో కూడిన అనుమతినిచ్చింది. అయితే, సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ మంగళవారం (నవంబర్ 24) దీపతూణ్ వద్ద దీపం వెలిగించలేదు. దీనిపై మదురై జిల్లా కలెక్టర్ బుధవారం సుప్రీంకోర్టుకు స్టేటస్ రిపోర్ట్ సమర్పించారు.
ప్రభుత్వ వివరణ ఇదే..
ఈ అంశంపై విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ ఎం. పంచోలిలతో కూడిన ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయలేకపోయినందుకు ప్రభుత్వం తరఫున బేషరతుగా క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు.
దీపం వెలిగించేందుకు ఆలయ యంత్రాంగం (దేవస్థానం) అనుమతి నిరాకరించడం వల్లే సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ‘దీపతూణ్’ వద్ద దీపం వెలిగించలేకపోయామని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. దర్గాకు సమీపంలో ఉన్న ఆ స్తంభం వద్ద దీపం వెలిగించడం ఆలయ సంప్రదాయం కాదని, దాదాపు 150 ఏళ్లుగా ఉచ్చిప్పిళ్లైయార్ ఆలయ దీప మండపం వద్దే మహాదీపం వెలిగిస్తున్నామని పేర్కొంది. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు, సంప్రదాయం ప్రకారమే దీప మండపంలో దీపాన్ని వెలిగించినట్లు స్పష్టం చేసింది.
కోర్టు ధిక్కరణ పిటిషన్పై విచారణ
మరోవైపు, సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన విజయ్ ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని పిటిషనర్లు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్టేటస్ రిపోర్టును పరిశీలిస్తామని, అలాగే కోర్టు ధిక్కరణ పిటిషన్ను కూడా పరిగణనలోకి తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది. కాగా, ఈ ఘటనపై తమిళనాడులో బీజేపీ, హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేపట్టాయి.








