జనసేన కార్యకర్త వీరాంజనేయులు మృతి నేపథ్యంలో ఆందోళన చేపట్టిన జనసేన నేతలు, కార్యకర్తలపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. జనసేన రాజంపేట ఇన్‌చార్జి హరిరాయల్‌తో సహా 12 మందిపై కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది.
టీడీపీ వర్గీయుల దాష్టీకం కారణంగానే వీరాంజనేయులు గుండెపోటుకు గురై మృతి చెందారని జనసేన కార్యకర్తలు పేర్కొన్నారు. వీరాంజనేయులు మృతదేహంతో చక్రాయపేట మండలం నాగులగుట్టపల్లిలో రోడ్డుపై ఆందోళన చేపట్టారు. ఆందోళన చేస్తున్న జనసేన కార్యకర్తలపై డీఎస్పీ మురళీ నాయక్ లాఠీచార్జి చేశారు. అనంతరం గుర్తుతెలియని వ్యక్తులు పలు వాహనాలను దగ్ధం చేశారు.
వాహనాల దహనం, ప్రజా ఆస్తుల ధ్వంసానికి సంబంధించి జనసేన రాజంపేట ఇన్‌చార్జి హరిరాయల్‌తో పాటు ఆయన సామాజికవర్గానికి చెందిన పలువురు, జనసేన కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 12 మందిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది.
ఓవైపు టీడీపీ వర్గీయుల కారణంగానే తమ పార్టీ కార్యకర్త ప్రాణాలు కోల్పోయారని జనసేన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తుండగా, మరోవైపు న్యాయం కోసం ఆందోళన చేపట్టిన జనసేన నేతలు, కార్యకర్తలపైనే కేసులు నమోదు కావడం కూటమి వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.







