హైపర్‌స్పెక్ట్రల్ ఇమేజింగ్ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంతరిక్ష స్టార్టప్ సంస్థ పిక్సెల్ (Pixxel) తన భారీ ఉపగ్రహాల తయారీ కేంద్రం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ను కాదని కర్ణాటకలోని బెంగళూరును ఎంచుకుంది.
బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ‘గిగాపిక్సెల్’ (GigaPixxel) పేరుతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ కేంద్రాన్ని 2027 మార్చి లేదా ఏప్రిల్‌లో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మనీకంట్రోల్ తన కథనంలో పేర్కొంది.
తొలుత ఈ కేంద్రంలో ఒకేసారి 50 ఉపగ్రహాలను తయారు చేసే సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. అనంతరం ఈ సామర్థ్యాన్ని 100 ఉపగ్రహాలకు పెంచాలని పిక్సెల్ ప్రణాళికలు రూపొందిస్తోంది. భారీ స్థాయిలో ఉపగ్రహాల తయారీకి ఈ కేంద్రం దోహదపడనుంది. పిక్సెల్ ఉపగ్రహాల తయారీ సామర్థ్యాన్ని విస్తరించడంలో ఈ ప్రాజెక్టు కీలకంగా నిలవనుంది.
పెట్టుబడులను ఆకర్షించేందుకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల మధ్య పోటీ పెరుగుతున్న తరుణంలో పిక్సెల్ తన భారీ తయారీ కేంద్రానికి బెంగళూరును ఎంచుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. గిగాపిక్సెల్ ఏర్పాటు ద్వారా కర్ణాటకలో ఆ సంస్థ కార్యకలాపాలు మరింత విస్తరించనున్నాయి. అంతరిక్ష సాంకేతిక రంగంలో భారీ తయారీ కేంద్రాన్ని ఆకర్షించే అవకాశం ఆంధ్రప్రదేశ్‌కు దక్కలేదు.








