పులివెందుల కోర్టులో(Pulivendula Court) పోలీసులకు (Police) చుక్కెదురైంది. వైసీపీ (YSRCP) నాయకుల అరెస్టు సందర్భంగా నిందితుల హక్కులకు భంగం కలిగించడంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి ఇలాంటి తప్పిదాలు జరిగితే కఠిన చర్యలు తప్పవని పులివెందుల డీఎస్పీ మురళి నాయక్‌ను(Murali Naik) హెచ్చరించింది.
గత నెల 17న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల(Municipal Elections Nominations) సందర్భంగా వైసీపీ నాయకులపై పోలీసులు కాల్పులు జరిపిన ఘటన వివాదాస్పదమైంది. ఈ ఘటనలో వైసీపీ నాయకులే పోలీసులపై దాడి చేశారంటూ హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును అక్రమంగా బనాయించారని వైసీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి. కేసుకు సంబంధించి సోమవారం వైసీపీ నాయకులు రామ్‌నాథ్‌రెడ్డి(Ramnath Reddy), ఖాన్‌లను(Khan) అరెస్టు చేసిన పోలీసులు మంగళవారం పులివెందుల కోర్టులో హాజరుపరిచారు.
అరెస్టు చేసే సమయంలో నిందితులకు ఉన్న చట్టబద్ధమైన హక్కులను పోలీసులు కాలరాశారని వైయస్సార్‌సీపీ నేతల తరఫు న్యాయవాది ఓబుల్‌రెడ్డి(Obul Reddy) కోర్టులో వాదించారు. ఏ కారణాలతో అరెస్టు చేస్తున్నారో నిందితులకు తెలియజేయడంతో పాటు సంబంధిత పత్రాలను అందజేయాల్సి ఉన్నప్పటికీ పులివెందుల పోలీసులు ఆ నిబంధనలను పాటించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
వాదనలు విన్న న్యాయస్థానం నిందితుల హక్కులకు భంగం కలిగించడంపై తీవ్రంగా స్పందించింది. మరోసారి ఇలాంటి తప్పిదాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ మురళి నాయక్‌ను హెచ్చరించింది. అనంతరం రామ్‌నాథ్‌రెడ్డి, ఖాన్‌లకు బెయిల్ మంజూరు చేసి, విడుదలకు ఆదేశించింది.








