ప్రశ్నించినందుకే దేశద్రోహమా..? రావణ్‌పై UAPA కేసు

ప్రశ్నించినందుకే దేశద్రోహమా..? రావణ్‌పై UAPA కేసు

Summarize with AI

ప్రశ్నించడానికి పుట్టిన పార్టీగా చెప్పుకునే జనసేన(Jana Sena).. ప్రశ్నించడం ప్రజాస్వామ్య హక్కు అని తరచూ చెప్పే ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan). కానీ అదే పార్టీ అధ్యక్షుడిని ప్రశ్నించిన వ్యక్తిపై ఇప్పుడు దేశద్రోహం, UAPA వంటి తీవ్రమైన సెక్షన్లతో కేసు నమోదు కావడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) తీవ్ర చర్చకు దారితీసింది.

జనసేన నేత, ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గరికపాటి శివశంకర్ (Garikipati Siva Shankar) ఇచ్చిన ఫిర్యాదు మేరకు గన్నవరం పోలీసులు ప్రశ్న రావణ్‌పై (Prashna Ravana) కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 147, 148, 152, 192, 197(1)(d), 353(1)(b)తో పాటు చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA)లోని సెక్షన్లు 13, 39 కింద కేసు నమోదు చేశారు.

ఈ సెక్షన్ల ప్రకారం దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించడం, సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టడం, దేశ సమగ్రతకు విఘాతం కలిగించడం, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ప్రోత్సాహం ఇవ్వడం, తిరుగుబాటు చర్యలను ప్రేరేపించడం వంటి తీవ్రమైన ఆరోపణలు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

అయితే గ‌త ఐదు రోజులుగా రావ‌ణ్ విష‌యంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్న పౌర స‌మాజం, ప్ర‌జాస్వామ్య‌వాదాలు, రావణ్ మద్దతుదారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. “పవన్ కళ్యాణ్ వైఖరిని, ఆయన గతంలో ఉపయోగించిన భాషలోనే తిరిగి సమాధానం చెప్పినందుకు ఒక సామాన్యుడిపై ఏకంగా రాజద్రోహం కేసు బుక్ చేస్తారా?” అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌శ్నించే వ్య‌క్తుల‌ను, రాజకీయ విమర్శలను అణిచివేయడానికి ఇలాంటి కఠిన చట్టాలను ఉపయోగించడం రాజ్యాంగ‌ స్ఫూర్తికి విరుద్ధమని అంటున్నారు.

ఇప్పటికే పిఠాపురం(Pithapuram), సర్పవరం(Sarpavaram), మచిలీపట్నం(Machilipatnam), నక్కపల్లి(Nakkapalli) కేసుల్లో రావణ్‌కు బెయిల్ లభించిన నేపథ్యంలో, ఈసారి ఎలాగైనా బెయిల్ రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే UAPA వంటి కఠిన సెక్షన్లు జోడించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan) ఆదేశాల‌తోనే ప్ర‌శ్న రావ‌ణ్‌పై క‌క్ష‌సాధింపు చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయ‌ని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు.

రావణ్ ప్రాణాలకు ముప్పు ఉందన్న ఆరోపణలు కూడా మరోసారి తెరపైకి వచ్చాయి. యలమంచిలి కోర్టులో బెయిల్ పొందిన అనంతరం విడుదల చేసిన వీడియోలో తనపై కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. “నన్ను చంపాలనుకుంటే పోలీస్ స్టేషన్‌లోనే చంపేయండి” అంటూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) కూటమి ప్రభుత్వం, పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై వరుస కేసులు నమోదు చేయడం, కఠిన చట్టాలను ప్రయోగించడం ద్వారా భయపెట్టే రాజకీయాలకు తెరలేపుతున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యంలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేయడం నేరమా? రాజకీయ విమర్శలకు దేశద్రోహం, UAPA వంటి చట్టాలే సమాధానమా? అనే ప్రశ్నలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment