‘మూడ్ ఆఫ్ ఆంధ్రా’ స‌ర్వే.. కూటమిపై తీవ్ర అసంతృప్తి

‘మూడ్ ఆఫ్ ఆంధ్రా’ స‌ర్వే.. కూటమిపై తీవ్ర అసంతృప్తి

Summarize with AI

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం పాలన స‌గం కాలాన్ని పూర్తి చేసుకునే దిశగా సాగుతున్న వేళ.. ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందన్న చర్చ జోరందుకుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన ఐఐటీయన్స్ గ్రూప్ నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ఆంధ్రా’ సర్వే ఆసక్తికర అంశాలను వెల్లడించింది.

రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జూన్ 18 నుంచి ఆగస్టు 20 వరకు మూడు దశల్లో సర్వే నిర్వహించినట్లు సంస్థ తెలిపింది. మొత్తం 1,90,550 మంది నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు పేర్కొంది. ఆన్‌లైన్, మెసేజ్‌ల ద్వారా కాకుండా నేరుగా ఓటర్లను కలిసి అభిప్రాయాలు సేకరించినట్లు ఐఐటీయన్స్ గ్రూప్ వెల్లడించింది.

రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలు, వివిధ కులాలు, మతాలకు చెందిన ప్రజలతో పాటు 18-30, 31-45, 46-59, 60 ఏళ్లు పైబడిన వయసు వర్గాలు, మహిళలు, పురుషుల అభిప్రాయాలను తీసుకున్నట్లు తెలిపింది.

కూటమి ప్రభుత్వ పరిపాలనపై మీ అభిప్రాయం ఏమిటన్న ప్రశ్నకు చాలా సంతృప్తిగా ఉన్నామని 4 శాతం, సంతృప్తిగా ఉన్నామని 30 శాతం మంది చెప్పినట్లు సర్వే పేర్కొంది. అదే సమయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన వారు 45 శాతంగా ఉన్నారు. ఏమీ చెప్పలేమని 7 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బెస్ట్ పార్టీ ఏదన్న ప్రశ్నకు కూటమికి 40 శాతం, వైసీపీకి 44.5 శాతం మంది మద్దతు తెలిపినట్లు సర్వే వెల్లడించింది.

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై కూడా కూటమి ప్రభుత్వానికి పూర్తి స్థాయి సానుకూలత కనిపించలేదని సర్వే పేర్కొంది. శాంతిభద్రతల విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నామని 7 శాతం, సాధారణ సంతృప్తి ఉందని 30 శాతం మంది అభిప్రాయపడ్డారు.

ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసిన డీఎస్సీ అక్రమాలపై కూడా ప్రజల అభిప్రాయాలను సర్వే సేకరించింది. అక్రమాలు జరిగాయని 48 శాతం, అలాంటి అక్రమాలేమీ జరగలేదని 39 శాతం మంది అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని 42 శాతం, లేదని 36 శాతం మంది పేర్కొన్నట్లు నివేదిక తెలిపింది.

రాష్ట్రంలో ప్రస్తుతం ప్రధాన సమస్య ఏంటని ప్రశ్నించగా ఆసక్తికరమైన సమాధానాలు వచ్చినట్లు సర్వే పేర్కొంది.

ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతి – 27 శాతం
రైతులు, కౌలుదారుల పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం – 25 శాతం
నిరుద్యోగం – 21 శాతం
శాంతిభద్రతలు లేకపోవడం – 15 శాతం
సంక్షేమ పథకాల అమలు – 12 శాతం

రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఎవరిని చూడాలనుకుంటున్నారని ప్రశ్నించగా.. 44 శాతం మంది వైఎస్ జగన్ పేరును చెప్పినట్లు సర్వే వెల్లడించింది. చంద్రబాబు నాయుడికి 32 శాతం, పవన్ కల్యాణ్‌కు 6 శాతం, లోకేశ్‌కు 5 శాతం మద్దతు లభించినట్లు పేర్కొంది.

వైసీపీపై వస్తున్న ‘గొడ్డలి పార్టీ’ ఆరోపణలను అంగీకరిస్తారా అన్న ప్రశ్నకు 31 శాతం మంది అవునని, 30 శాతం మంది రాజకీయ కక్షతో చేస్తున్న ఆరోపణలని, 32 శాతం మంది వాటిని అంగీకరించడం లేదని, రాజకీయాలను పక్కదారి పట్టించేందుకే ఆరోపణలు చేస్తున్నారని అభిప్రాయపడినట్లు సర్వే తెలిపింది.

కూటమి ప్రభుత్వం 2029లో తిరిగి అధికారంలోకి వస్తుందా అన్న ప్రశ్నకు 44 శాతం మంది రాదని, 39 శాతం మంది వస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఎమ్మెల్యేలపై వస్తున్న అవినీతి ఆరోపణలను మీరు నమ్ముతున్నారా అన్న ప్రశ్నకు 47 శాతం మంది నమ్ముతున్నామని, 38 శాతం మంది నమ్మడం లేదని చెప్పినట్లు సర్వే పేర్కొంది. ట్రయాంగిల్ పోటీ జరిగితే ఎవరికి ప్రయోజనం కలుగుతుందని అడగగా వైసీపీకి 49 శాతం, టీడీపీకి 34 శాతం, జనసేనకు 7 శాతం మంది అనుకూలంగా అభిప్రాయం వ్యక్తం చేసినట్లు నివేదిక తెలిపింది.

గత పాలన, ప్రస్తుత పాలనపై ప్రజల అభిప్రాయాలను పోల్చినప్పుడు వైసీపీ పరిపాలన బాగుందని 41 శాతం, కూటమి పాలన బాగుందని 38 శాతం మంది పేర్కొన్నట్లు సర్వే వెల్లడించింది. దొందూ దొందేనని 12 శాతం మంది అభిప్రాయపడ్డారు.

టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా.. వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయన్న ప్రశ్నకు సర్వే ఆసక్తికర అంచనాలను వెల్లడించింది.

కూటమి – 44.5 శాతం ఓట్లు
వైసీపీ – 45.5 శాతం ఓట్లు
ఇతరులు – 3.5 శాతం
ఇంకా నిర్ణయం తీసుకోని వారు – 6.5 శాతం

ఈ ఓటు శాతం ఆధారంగా వైసీపీకి 83 అసెంబ్లీ సీట్లు, కూటమికి 62 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఐఐటీయన్స్ గ్రూప్ అంచనా వేసింది. మరో 30 స్థానాల్లో గట్టి పోటీ ఉంటుందని పేర్కొంది.

టీడీపీ, జనసేన, బీజేపీ వేర్వేరుగా.. వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తే పరిస్థితి మరింత మారుతుందని సర్వే అంచనా వేసింది.

వైసీపీ – 47 శాతం
టీడీపీ – 36 శాతం
జనసేన – 6.5 శాతం
బీజేపీ – 2.5 శాతం
ఇతరులు – 2.5 శాతం
నిర్ణయం తీసుకోని వారు – 5.5 శాతం

ఈ ఓటు షేర్ ప్రకారం వైసీపీకి 110-112 సీట్లు, టీడీపీకి 43-45 సీట్లు, జనసేనకు 2-4 సీట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కే అవకాశం లేదని పేర్కొంది. మరో 20-21 నియోజకవర్గాల్లో హోరాహోరీ పోటీ ఉంటుందని తెలిపింది.

వైసీపీ, టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తూ.. జనసేన, బీజేపీ కలిసి బరిలోకి దిగితే ఫలితాలు ఇలా ఉండొచ్చని సర్వే పేర్కొంది.

వైసీపీ – 46.5 శాతం
టీడీపీ – 35 శాతం
జనసేన-బీజేపీ కూటమి – 10.5 శాతం

ఈ ఓటు షేర్ ప్రకారం వైసీపీకి 95-96 సీట్లు, టీడీపీకి 40-41 సీట్లు, జనసేన-బీజేపీ కూటమికి 7-9 సీట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. 30కి పైగా స్థానాల్లో గట్టి పోటీ ఉంటుందని పేర్కొంది.

ఉమ్మడి 13 జిల్లాల ప్రాతిపదికన కూటమి ఎమ్మెల్యేలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించినట్లు సర్వే తెలిపింది.

రెడ్‌జోన్ – 72 మంది ఎమ్మెల్యేలు
ఆరెంజ్‌జోన్ – 30 మంది ఎమ్మెల్యేలు
గ్రీన్‌జోన్ – 73 మంది ఎమ్మెల్యేలు

కూటమి ప్రభుత్వంలోని మంత్రుల్లో 10 మంది రెడ్‌జోన్‌లో, 8 మంది ఆరెంజ్‌జోన్‌లో, 7 మంది గ్రీన్‌జోన్‌లో ఉన్నట్లు సర్వే అంచనా వేసింది.

మారుతున్న రాజకీయ సమీకరణాలు
2024 ఎన్నికల్లో కేవలం 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైన వైసీపీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే పలు సర్వే అంచనాల్లో అధికారానికి చేరువగా కనిపించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

అయితే ఈ ఫలితాలు ఐఐటీయన్స్ గ్రూప్ నిర్వహించినట్లు పేర్కొన్న సర్వే అంచనాలు మాత్రమే. భవిష్యత్ ఎన్నికల ఫలితాలకు ఇవి ఖచ్చితమైన సూచికలు కావని గమనించాల్సి ఉంటుంది. అయినప్పటికీ 175 నియోజకవర్గాల్లో 1,90,550 మంది నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు సంస్థ చెప్పడం, వివిధ వర్గాల ప్రజలను సర్వేలో భాగం చేశామని వెల్లడించడం వల్ల ఈ ‘మూడ్ ఆఫ్ ఆంధ్రా’ సర్వే రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.

మొత్తంగా చూస్తే.. కూటమి ప్రభుత్వం తన పాలనలో లోపాలను సరిదిద్దుకుని ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందనే సంకేతాలను ఈ సర్వే ఫలితాలు ఇస్తున్నాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి గణనీయమైన సీట్లు వచ్చే అవకాశం ఉందన్న అంచనా.. అధికార కూటమికి రాజకీయంగా హెచ్చరిక సంకేతంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment