కుప్పం పర్యటనలో(Kuppam Tour) భాగంగా నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) చేసిన వ్యాఖ్యలపై టీడీపీ(TDP) వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు సతీమణి (NTR Wife) నందమూరి లక్ష్మీపార్వతి (Nandamuri Lakshmi Parvathi) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భువనేశ్వరి మాట్లాడేవన్నీ అబద్ధాలని, చంద్రబాబు (Chandrababu Naidu) ఆయన కొడుకు లోకేష్ (Nara Lokesh) నిర్మించిన అబద్ధాల ప్రపంచంలోకి ఆమె కూడా ప్రవేశించడం విచారకరమని మండిపడ్డారు.
శాసనసభలో తనకు అవమానం జరిగిందంటూ నారా భువనేశ్వరి చేస్తున్న ప్రచారాన్ని లక్ష్మీపార్వతి తీవ్రంగా ఖండించారు. నిజంగా సభలో అవమానం జరిగిందో లేదో తెలియాలంటే అసెంబ్లీ రికార్డులను (Assembly Records) వెంటనే బయటకు తీయించాలని, ప్రస్తుతం ఏపీలో వారి ప్రభుత్వమే ఉంది కాబట్టి ఆ పని చేయడం పెద్ద కష్టం కాదని సవాల్ విసిరారు. కేవలం రాజకీయ ప్రయోజనాలు, ప్రజల్లో సానుభూతి పొందేందుకే ఈ తరహా నాటకాలకు తెరలేపారని విమర్శించారు.
రాజకీయ ప్రయోజనాల కోసం భువనేశ్వరిని అడ్డుపెట్టుకుని చంద్రబాబు, లోకేష్ వాడుకుంటున్నారని లక్ష్మీపార్వతి ఆరోపించారు. “నీ క్యారెక్టర్, నీ వ్యక్తిత్వంపై ఊరూవాడా దుష్ప్రచారం చేసింది నీ భర్త, నీ కొడుకే. రాజకీయాల కోసం నన్ను ఎందుకు బజార్లో పెడుతున్నారని వారిని నిలదీయాల్సింది పోయి, ఇతరులపై నిందలు వేయడం సిగ్గుచేటు” అంటూ లక్ష్మీ పార్వతి ఎద్దేవా చేశారు.
ఐటీడీపీ (iTDP) ద్వారా ప్రత్యర్థి పార్టీల మహిళలపై, ప్రత్యేకించి వైఎస్సార్(YSRCP) కుటుంబానికి చెందిన స్త్రీలపై జరుగుతున్న నీచమైన సోషల్ మీడియా దాడిపై భువనేశ్వరి ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. పరాయి స్త్రీల ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ, అసహ్యకరమైన పోస్టులతో ట్రోల్స్ చేస్తుంటే ఒక మహిళగా భువనేశ్వరి ఎందుకు స్పందించడం లేదని అడిగారు.
లక్షల మంది సమక్షంలో ధర్మబద్ధంగా ఎన్టీఆర్ వివాహం చేసుకున్న తనపైనే (లక్ష్మీపార్వతిపై) 60 ఏళ్ల వయసులో కూడా లోకేష్ దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాటి మహిళలను గౌరవించని లోకేష్‌కు సంస్కారం నేర్పించడంలో భువనేశ్వరి తల్లిగా విఫలమయ్యారని విమర్శించారు.
చంద్రబాబు నాయుడు నిజాయితీపరుడని, ఇచ్చిన మాట తప్పడని భువనేశ్వరి అనడం ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్ అని అభివర్ణించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన 143 హామీలు ఏమయ్యాయని, ‘ఆడబిడ్డ నిధి’ (Aadabidda Nidhi Scheme), ‘ఉచిత గ్యాస్ సిలిండర్ల’(Free Gas Cylinders) పథకం అమలుపై చంద్రబాబును ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. రైతుల(Farmers) కోసం ఉచిత విద్యుత్ (Free Electricity)తెచ్చింది దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి (Y. S. Rajasekhara Reddy)అని, ఆ క్రెడిట్‌ను కూడా చంద్రబాబు ఖాతాలో వేయడం పచ్చి అబద్ధమని వ్యాఖ్యానించారు.
చిన్నారులపై జరుగుతున్న దాడులు, రాష్ట్ర సమస్యలపై స్పందించని భువనేశ్వరి, కేవలం ఎన్నికల లబ్ధి కోసం చంద్రబాబు ఆడుతున్న అబద్ధాల నాటకాల్లో భాగస్వామి కావడం ఎన్టీఆర్ కుమార్తెగా శోచనీయమని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు.
నారా భువనేశ్వరి మాట్లాడేదంతా పచ్చి అబద్ధం
— Telugu Feed (@Telugufeedsite) July 31, 2026
నీ వ్యక్తిత్వాన్ని, నీ క్యారెక్టర్ మీద ఊరూవాడ ప్రచారం చేసింది నీ కొడుకు, నీ భర్త
'రాజకీయ ప్రయోజనాల కోసం నన్ను బజార్లో పెడతారా?' అని నీ కొడుకుని నాలుగు తన్ను, నాలుగు దెబ్బలేయి
అది పోయి… నువ్వు కూడా ఎవరో మీద నిందలేస్తే ఎట్లమ్మా?… pic.twitter.com/xfQFpAd0JD








