‘నా చావుకు సీఐ నాగరాజు కార‌ణం’.. – మ‌రో యువ‌కుడి సెల్ఫీ వీడియో

'నా చావుకు సీఐ నాగరాజు కార‌ణం'.. - మ‌రో యువ‌కుడి సెల్ఫీ వీడియో

గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ ఆరోప‌ణ‌ల ఉదంతం వెలుగుచూసిన నాలుగు రోజులు గడవకముందే, కృష్ణలంక మాజీ సీఐ వేధింపుల తాలూకు సంచ‌ల‌న వీడియో బ‌య‌ట‌ప‌డింది. గ‌త నెల‌లో ఆత్మ‌హ‌త్య చేసుకున్న విజ‌య‌వాడ వాసి క్రాంతి కుమార్ వీడియో సంచ‌ల‌నంగా మారింది.

“నేను మాదిగ పుటక పుట్టడమే తప్పైపోయింది సార్.. గత మూడు నెలలుగా నన్ను వేటాడి, వెంటాడి కొడుతున్నారు.. ఇంక నేను బతకలేను” అంటూ కృష్ణలంక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (CI) నాగరాజుపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, కెమెరా ముందే గుళికలు మింగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ హృదయవిదారక ‘డెత్ సెల్ఫీ’ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలోనూ వైర‌ల్‌గా మారింది.

అసలేం జరిగింది..?
విజయవాడ లబ్బీపేట పరిధిలోని పకీరుగూడెం, అంబేద్కర్ బాబు జగజీవన్ రామ్ కాలనీకి చెందిన పేరుపోగు క్రాంతి కుమార్ వృత్తిరీత్యా టాక్సీ డ్రైవర్. గతంలో అతనిపై కొన్ని క్రిమినల్ కేసులు ఉండటంతో కృష్ణలంక పోలీసులు అతనిపై ‘సస్పెక్ట్ షీట్’ (Suspect Sheet) తెరిచారు. దీన్ని ఆసరాగా చేసుకుని కృష్ణలంక సీఐ నాగరాజు గత మూడు నెలలుగా క్రాంతి కుమార్‌ను తీవ్రంగా వేధించడం ప్రారంభించారు. ప్రతి ఆదివారం రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్లను స్టేషన్‌కు పిలిపించి భయోత్పాతానికి గురిచేయడం, థర్డ్ డిగ్రీ ప్రయోగించడం సీఐ నాగరాజుకు అలవాటుగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి.

మే 21వ తేదీన క్రాంతి కుమార్ ఇంట్లో ఉండగా.. సీఐ నాగరాజు తీసుకురమ్మన్నారంటూ ఇద్దరు పోలీసులు అతని ఇంటికి వెళ్లారు. మళ్లీ స్టేషన్‌కు వెళ్తే పోలీసులు ఎలాంటి నరకం చూపిస్తారోననే తీవ్ర భయాందోళనకు గురైన క్రాంతి కుమార్, పోలీసులు చూస్తుండగానే ఇంట్లోని క్రిమిసంహారక గుళికలను మింగి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు.

“నా చావుకు కారణం కృష్ణలంక సీఐ నాగరాజు గారు. నేను, మాదిగ పుటక పుడతం తప్పైపోయింది. నన్ను వేటాడి, వెంటాడి వేధిస్తున్నారు. గత మూడు నెలల నుంచి నన్ను కొడతనే ఉన్నారు. నేను ఇంక బతకలేక పోతున్నాను. నా చావుకు కారణం కృష్ణలంక సీఐ గారే. ఇంక నేను బతకలేను. గుళికల మందు తాగేస్తున్నాను.. నా చావుకు కారణం కృష్ణలంక సీఐ గారే.. అంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.

విషం తాగిన క్రాంతి కుమార్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివాహితుడైన క్రాంతి కుమార్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

మృతుడి తండ్రి ‘MRPS’ రాష్ట్ర అధ్యక్షుడు
క్రాంతి కుమార్ తండ్రి పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) రాష్ట్ర అధ్యక్షుడు. సీఐ నాగరాజు చేసిన దాడి, నిరంతర అవమానాల వల్లే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌కు అధికారికంగా ఫిర్యాదు చేశారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మే 22, 2026న కృష్ణలంక పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేశారు.

సాయికృష్ణ కేసులో ఇప్పటికే సీఐ నాగరాజు సస్పెండ్ అయినప్పటికీ, క్రాంతి కుమార్ ఆత్మహత్యకు కారణమైన అదే సీఐ నాగరాజుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఎందుకు పెట్టలేదని, ఉన్నతాధికారులు ఈ వ్యవహారాన్ని ఎందుకు తొక్కిపెట్టాలని చూస్తున్నారని దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒకే పోలీస్ స్టేషన్ పరిధిలో, ఒకే సీఐ వేధింపులు వల్ల ఇద్దరు యువకులు బలికావడంపై ద‌ళిత సంఘాలు అనుమానాల‌ను వ్య‌క్తం చేస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment