ఏపీలో సంచలనం రేపుతున్న జనసైనికుడు, కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ వ్యవహారం జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) మెట్లెక్కింది. ఈ కేసులో పోలీసులు తీవ్ర అక్రమాలకు, మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ మాజీ ఎంపీ కేశినేని నాని ఎన్‌హెచ్‌ఆర్‌సీకి అధికారికంగా ఫిర్యాదు సమర్పించారు. సాక్ష్యాలను రూపుమాపేందుకు బెజవాడ పోలీసులు అత్యంత క్రూరమైన వ్యూహాన్ని అమలు చేశారని నాని ఆరోపించడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
గాదె సాయికృష్ణను విచారణ పేరుతో పోలీస్ స్టేషన్‌లో థర్డ్ డిగ్రీ ఉపయోగించి తీవ్రంగా హింసించారని, ఆ గాయాలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతోనే అతని మృతదేహాన్ని పోలీసులు రహస్యంగా దహనం చేశారని కేశినేని నాని ఆరోపించారు.
భవిష్యత్తులో ఫోరెన్సిక్ పరీక్షలు లేదా డీఎన్ఏ (DNA) సాక్ష్యాలు దొరకకుండా ఉండేందుకే, సాయికృష్ణ అస్థికలను కూడా కృష్ణానదిలో కలిపేశారని నాని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
విజయవాడలో పోలీసులు ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయారని నాని మండిపడ్డారు. కొందరు పోలీసులు మాఫియాలకు కొమ్ముకాస్తూ నగరంలో “ప్రైవేట్ సెటిల్‌మెంట్ సిండికేట్” నడుపుతున్నారని ధ్వజమెత్తారు.
ఈ ఘోరానికి బాధ్యత వహిస్తూ ‘కమాండ్ రెస్పాన్సిబిలిటీ’ కింద విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర బాబును తక్షణమే సర్వీసు నుంచి సస్పెండ్ చేయాలని కేశినేని నాని డిమాండ్ చేశారు. ఒక ఐపీఎస్ అధికారి పర్యవేక్షణ లోపించడం వల్లే కింది స్థాయి పోలీసులు ఇంతలా రెచ్చిపోయారని ధ్వజమెత్తారు.
సాయికృష్ణ అక్రమ నిర్బంధం, తదనంతర హత్య ఉదంతంపై వాస్తవాలు వెలుగులోకి రావాలంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 176(1A) కింద తక్షణమే ఒక స్వతంత్ర జ్యుడీషియల్ (న్యాయపరమైన) విచారణ జరిపించాలని మాజీ ఎంపీ ఎన్‌హెచ్‌ఆర్‌సీని కోరారు.
రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ ఈ కేసు విచారణాధికారిగా నేడు కృష్ణలంక స్టేషన్‌కు వస్తున్న తరుణంలోనే, కేశినేని నాని నేరుగా జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయడం కూటమి ప్రభుత్వానికి, విజయవాడ పోలీస్ విభాగానికి పెద్ద ఇరకాటంగా మారింది.








