పంచాయతీ ఎన్నికల వేళ రేణిగుంటలో పోలీసుల వ్యవహారశైలిపై జనసేన నాయకురాలు వినుత కోట తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల విధుల్లో పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జనసేన పార్టీ నాయకులు, ఎన్నికల ఏజెంట్ల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తుండగా.. అధికార టీడీపీ నాయకులకు మాత్రం అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ప్రక్రియలో అధికార పార్టీకి ఒకలా, ప్రతిపక్షాలకు మరోలా నిబంధనలు అమలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.
ముఖ్యంగా సీఐ సురేంద్రనాథ్‌రెడ్డి వ్యవహారశైలిపై వినుత కోట తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన టీడీపీ నాయకులకు మద్దతుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జనసేన పార్టీ ఎన్నికల ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల నుంచి బలవంతంగా బయటకు పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు టీడీపీ నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడేందుకు పోలీసులు సహకరిస్తున్నారని విమర్శించారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకు విఘాతం కలిగిస్తున్నారని మండిపడ్డారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కూడా ఇలాంటి పరిస్థితులను చూడలేదని వినుత కోట ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. పోలీసులు తమ విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలని, ఏ పార్టీకి అనుకూలంగా వ్యవహరించకుండా ఎన్నికల నిబంధనలను అందరికీ సమానంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, రేణిగుంట సర్పంచ్ అభ్యర్థిగా వినుత కోట తల్లి నగరం జయలలిత ప్రస్తుతం ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రేణిగుంటలో చోటుచేసుకుంటున్న పరిణామాలు స్థానికంగా రాజకీయ చర్చకు దారితీశాయి.








