తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి ఓ భక్తుడు భారీ విరాళాన్ని అందజేశారు. చెన్నైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, యాక్సెస్ హెల్త్‌కేర్ వ్యవస్థాపకుడు, వైస్ ఛైర్మన్ వర్దమాన్ జైన్ ఏకంగా 121 కిలోల బంగారు ఆభరణాలను శ్రీవారికి సమర్పించారు. మొత్తం 46 ఆభరణాలను ప్రత్యేకంగా తయారు చేయించి విరాళంగా అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ ఆభరణాలను అందజేశారు.
శ్రీవారి పాదాల నుంచి శిరస్సు వరకు అలంకరించేందుకు అవసరమైన వివిధ రకాల ఆభరణాలను భక్తుడు తయారు చేయించారు. భక్తి, ఆధ్యాత్మిక భావంతో ఈ భారీ విరాళాన్ని అందించిన వర్దమాన్ జైన్ 2019 నుంచి తిరుమల శ్రీవారికి విరాళాలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతటి విలువైన బంగారు ఆభరణాలను సమర్పించడంతో ఈ విరాళం భక్తులలో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది.
విజయానికి కృతజ్ఞతగా భారీ విరాళం
వ్యాపారంలో విజయం సాధించాలని గతంలో వేంకటేశ్వర స్వామిని మొక్కుకున్న ఆయన, అనంతరం విదేశాల్లో ఐటీ కంపెనీని స్థాపించి విజయవంతమైన పారిశ్రామికవేత్తగా ఎదిగారు. ఈ క్రమంలో తన కంపెనీలో 60 శాతం వాటాను విక్రయించగా సుమారు 1.5 బిలియన్ డాలర్లు (రూ.6 వేల కోట్లకు పైగా) లభించినట్లు సమాచారం. తన వ్యాపార విజయానికి శ్రీవారి అనుగ్రహమే కారణమని భావించి ఆయన, కృతజ్ఞతగా తన సంపదలో కొంత భాగాన్ని స్వామివారికి సమర్పించినట్లు తెలుస్తుంది.








