పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వ్యవహరించిన తీరు తీవ్ర వివాదానికి దారితీసింది. వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఉన్న ప్రాంతంలోకి ఆమె కాన్వాయ్ దూసుకెళ్లడంతో పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురికి గాయాలైనట్లు సమాచారం. వారిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యే అఖిలప్రియ కాన్వాయ్ దూసుకెళ్లిన సమయంలో ఓ మహిళ వాహనం కింద ఇరుక్కుపోయింది. తీవ్ర గాయాలతో ఆమె అక్కడే ఆర్తనాదాలు చేసింది. ఈ దృశ్యాలతో అక్కడున్నవారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించిన స్థానికులు వాహనం కింద చిక్కుకున్న మహిళను బయటకు తీశారు. అనంతరం అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో మరో నలుగురు కూడా గాయపడటంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.
అహోబిలంలో ఉద్రిక్త పరిస్థితులు
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అహోబిలంలో ఇప్పటికే రాజకీయ వాతావరణం వేడెక్కింది. టీడీపీ, వైఎస్సార్సీపీ మద్దతుదారుల మధ్య నెలకొన్న వివాదం చివరకు ఘర్షణకు దారితీసింది. ఎమ్మెల్యే కాన్వాయ్ ఘటనతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాల్సిన సమయంలో రాజకీయ ఘర్షణలు చోటుచేసుకోవడం, సామాన్య ప్రజలు గాయాలపాలవడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది.








