ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఇంటికీ రక్షిత తాగునీరు అందిస్తామని ఇచ్చిన హామీ అమలుపై చర్చ జరుగుతున్న వేళ.. కూటమి ప్రభుత్వం ‘జల్ జీవన్ మిషన్–అమరజీవి జలధార’ పేరుతో భారీ మంచినీటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తోంది. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ప్రాజెక్టులకే కొత్త పేర్లు పెట్టి క్రెడిట్ తీసుకునే ప్రయత్నం జరుగుతోందని వైసీపీ ఆరోపిస్తోంది.
కేంద్ర జల్ జీవన్ మిషన్ గణాంకాల ప్రకారం 2026 సెప్టెంబర్ 29 నాటికి ఏపీలో 95,53,387 గ్రామీణ కుటుంబాలు ఉండగా.. 72,72,744 కుటుంబాలకు ట్యాప్ వాటర్ కనెక్షన్లు ఉన్నాయి. అంటే సుమారు 22.8 లక్షల కుటుంబాలు ఇంకా ట్యాప్ వాటర్ కవరేజీకి బయటే ఉన్నాయి.
ఉద్దానం ప్రాంతంలో రక్షిత మంచినీటి కోసం గత ప్రభుత్వం చేపట్టిన సుమారు రూ.700 కోట్ల వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టును 2023లోనే పూర్తి చేసి ప్రారంభించింది. ఏడు మండలాల్లోని 807 గ్రామాలకు నీరు అందించేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు.
అదేవిధంగా రూ.480 కోట్ల పులివెందుల మెగా వాటర్ గ్రిడ్ కూడా గతంలోనే చేపట్టిన ప్రాజెక్టు. 299 ఆవాసాలు, 109 గ్రామ పంచాయతీల పరిధిలో సుమారు 5.36 లక్షల మందికి నీరు అందించడమే దీని లక్ష్యం. 2026 ఆగస్టు నాటికి పనులు 96 శాతం పూర్తయ్యాయని ప్రభుత్వం తెలిపింది.
2019 నుండి జగన్ హయాంలోనే ఏకంగా 39.35 లక్షల కుటుంబాలకు కొత్తగా ట్యాప్ కనెక్షన్లు ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం దాదాపు రూ.26,823 కోట్ల విలువైన తాగునీటి పనులకు ఆమోదం తెలిపింది.
అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం చేపట్టిన 44,194 చిన్న తాగునీటి పనులను (రూ.10,000 కోట్లకు పైగా విలువైనవి) కూటమి ప్రభుత్వం రద్దు చేసి, గ్రామీణ తాగునీటి సదుపాయాలను ఆలస్యం చేసింది. కేంద్ర జల్ జీవన్ మిషన్ పనులకు ‘అమరజీవి జలధార’ అని కొత్త బ్రాండింగ్ తగిలించి, రద్దు చేసిన పనులనే రూ.9,355 కోట్ల విలువైన 10 మల్టీ-విలేజ్ ప్రాజెక్టులుగా మళ్లీ శంకుస్థాపనలు చేస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల ముందు శంకుస్థాపనల ఆర్భాటాలు తప్ప, కూటమి ప్రభుత్వం కొత్తగా సాధించిన పురోగతి శూన్యమని.. జగన్ మార్క్ ప్రాజెక్టులకు తమ స్టిక్కర్లు వేసుకోవడమే చంద్రబాబు ప్రభుత్వ ప్రచార నమూనా అని ప్రతిపక్షం ఎండగడుతోంది. నేడు ప్రొద్దుటూరులో కూటమి నేతలు జగన్ పూర్తి చేసిన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంచినీటి ప్రాజెక్టులపై మొదలైన ఈ ప్రచారం.. అభివృద్ధి కంటే క్రెడిట్ రాజకీయాలకే ప్రాధాన్యమా? అనే చర్చకు దారితీస్తోంది.








