వైఎస్ జగన్ అల్టిమేటం.. దిగొచ్చిన ప్ర‌భుత్వం

వైఎస్ జగన్ అల్టిమేటం.. దిగొచ్చిన ప్ర‌భుత్వం

Summarize with AI

ఆంధ్రప్రదేశ్‌లో కరువు పరిస్థితులపై రాజకీయ దుమారం కొనసాగుతున్న వేళ చంద్ర‌బాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరువు మండలాలను అక్టోబర్ 1న ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి ప్రతిపాదనలను సెప్టెంబర్ 24లోగా, రాష్ట్రస్థాయి ప్రతిపాదనలను సెప్టెంబర్ 29లోగా సిద్ధం చేయాలని సూచించారు.

కరువు పరిస్థితులు, రైతుల ఇబ్బందులు, సాగునీటి కొరతపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండ్రోజుల క్రితం (సెప్టెంబర్ 17న‌) పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించిన నేపథ్యంలోనే కూట‌మి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో రాష్ట్రంలోని వర్షాభావ పరిస్థితులు, పంటల సాగు, వ్యవసాయంపై ప్రభావం, తాగునీటి సమస్య తదితర అంశాలపై అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు. రాష్ట్రంలో 513 మండలాల్లో కరువు ఛాయలు ఉన్నట్లు అధికారులు నివేదిక ఇచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. సెప్టెంబర్ 24 నాటికి జిల్లా స్థాయి ప్రతిపాదనలు, సెప్టెంబర్ 29 నాటికి రాష్ట్రస్థాయి ప్రతిపాదనలు పూర్తి చేసి.. అక్టోబర్ 1న కరువు మండలాలను అధికారికంగా ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, సాగునీటి కొరత, పంట నష్టాలు, రైతుల ఇబ్బందులపై వైఎస్ జగన్ సెప్టెంబర్ 17న వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా వారీగా క్షేత్రస్థాయి పరిస్థితులను నేతల నుంచి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కరువు మండలాలను వెంటనే ప్రకటించాలని జగన్ డిమాండ్ చేశారు. రైతుల రుణాల రీషెడ్యూల్, పంటల నష్టపరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా, పశుగ్రాసం, తాగునీటి సరఫరా వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు.

‘ఎల్లో నినో’ అంటూ జగన్ విమర్శలు
కరువు పరిస్థితులపై జగన్ ప్రభుత్వం తీరును తీవ్రంగా విమర్శించారు. ఇది కేవలం ఎల్‌నినో ప్రభావం కాదని, ప్రభుత్వ వైఫల్యం వల్ల పరిస్థితి మరింత తీవ్రంగా మారిందని ఆరోపిస్తూ ‘ఎల్లో నినో’ అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 688 మండలాల్లో 628 మండలాలు కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని, వాటిలో 332 మండలాల్లో పరిస్థితి తీవ్రంగా ఉందని జగన్ తెలిపారు. సాధారణంగా 76 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు జరగాల్సి ఉండగా.. 56.4 లక్షల ఎకరాల్లోనే సాగు జరిగిందని, దాదాపు 20 లక్షల ఎకరాలు సాగుకు దూరంగా ఉన్నాయని ఆయన వివరించారు.

విశాఖ తాగునీటి సమస్యపైనా సీఎం సమీక్ష
కరువు పరిస్థితులతో పాటు విశాఖపట్నం తాగునీటి సమస్యపైనా ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. నగరానికి రోజుకు సుమారు 480 ఎంఎల్‌డీ నీరు అవసరం ఉండగా.. ప్రస్తుతం సుమారు 380–390 ఎంఎల్‌డీ మేర మాత్రమే సరఫరా అవుతున్నట్లు స్థానిక వైసీపీ నేతలు ఇటీవల జరిగిన సమీక్షలో ప్రస్తావించారు. దీంతో విశాఖ నగరానికి తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది.

అక్టోబర్ 1న అధికారిక ప్రకటన
ప్రస్తుతం అధికారుల వద్ద ఉన్న వర్షపాతం, పంటల పరిస్థితి, నీటి లభ్యత తదితర వివరాల ఆధారంగా జిల్లా స్థాయిలో ప్రతిపాదనలు సిద్ధం కానున్నాయి. అనంతరం రాష్ట్రస్థాయి పరిశీలన పూర్తి చేసి అక్టోబర్ 1న కరువు మండలాలను ప్రకటించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

వైఎస్ జగన్ కరువు పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన మరుసటి రోజుల్లోనే ప్రభుత్వం కరువు మండలాల ప్రకటనకు గడువులు నిర్ణయించడం ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. ఇక అక్టోబర్ 1న ఎన్ని మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తుంది? రైతులకు ఎలాంటి ఉపశమన చర్యలు ప్రకటిస్తుంది? అన్నది ఆసక్తికరంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment