కాపు యువకుడు గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి గులివిందల సురేష్ రిమాండ్ రిపోర్టులో సిట్ కీలక అంశాలను కోర్టు ముందుంచింది. పోలీసుల దాడుల్లో తీవ్రంగా గాయపడిన సాయికృష్ణను రాణిగారితోటలోని పాడుబడ్డ భవనానికి తరలించారని, అక్కడే ఆయన స్పృహతప్పి మృతి చెందారని సిట్ నివేదికలో పేర్కొంది. అనంతరం మృతదేహాన్ని అర్ధరాత్రి మోటార్‌సైకిల్‌పై స్వర్గపురి శ్మశానవాటికకు తరలించి దహనం చేసినట్లు వివరించింది.
మే 7న పోలీస్‌స్టేషన్‌లో దాడి
సిట్ రిమాండ్ రిపోర్టు ప్రకారం.. మే 7న కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో సాయికృష్ణను అప్పటి సీఐ ఎస్ఎస్వీవీ నాగరాజు, హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని విచారించారు. ఈ సమయంలో సాయికృష్ణపై తీవ్రంగా దాడి జరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లోనే ఉంచితే అనుమానం వచ్చే అవకాశం ఉందన్న ఉద్దేశంతో సీఐ నాగరాజు ఆదేశాల మేరకు సాయికృష్ణను రాణిగారితోటలోని ఓ ప్రైవేటు పాడుబడ్డ భవనానికి తరలించినట్లు సిట్ తెలిపింది.
‘నన్ను చంపేందుకే కొడుతున్నారు’
మే 12న సీఐ నాగరాజును కలిసేందుకు వెళ్లిన సురేష్.. రాణిగారితోటలోని ఆ పాడుబడ్డ భవనంలో తీవ్ర గాయాలతో ఉన్న సాయికృష్ణను చూశాడని రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది. ఆ సమయంలో తనను చంపేందుకే కొడుతున్నారని సాయికృష్ణ సురేష్‌తో చెప్పినట్లు నివేదికలో వివరించింది. సురేష్‌తో మాట్లాడుతుండగానే సాయికృష్ణ స్పృహతప్పి కుప్పకూలి మృతి చెందినట్లు సిట్ పేర్కొంది. పోలీసుల దాడుల కారణంగానే సాయికృష్ణ మరణించాడని సిట్ దర్యాప్తులో తేలినట్లు రిమాండ్ రిపోర్టులో నమోదు చేసింది.
అర్ధరాత్రి బైక్‌పై మృతదేహం.. స్వర్గపురిలో దహనం
సాయికృష్ణ మృతి అనంతరం మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి మోటార్‌సైకిల్‌పై తరలించినట్లు సిట్ నివేదికలో పేర్కొంది. మే 12 అర్ధరాత్రి సాయికృష్ణ మృతదేహాన్ని స్వర్గపురి శ్మశానవాటికకు తీసుకెళ్లి సీఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ అశోక్, సురేష్ కలిసి దహనం చేసినట్లు వివరించింది. మృతదేహం పూర్తిగా కాలిపోయే వరకు ముగ్గురూ అక్కడే ఉన్నారని సిట్ తెలిపింది. మే 18న సురేష్ మరోసారి స్వర్గపురి శ్మశానవాటికకు వెళ్లి మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్లు ఏమైనా మిగిలాయా? అని పరిశీలించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
కస్టడీలో తీసిన ఫొటోలు డిలీట్
సాయికృష్ణ పోలీసుల కస్టడీలో ఉన్న సమయంలో తీసిన ఫొటోలను కూడా తొలగించినట్లు సిట్ నివేదికలో పేర్కొంది. సీఐ నాగరాజు ఆదేశాలతో హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ మొబైల్ ఫోన్లో ఉన్న ఫొటోలను డిలీట్ చేసినట్లు వెల్లడించింది. ఈ చర్య ద్వారా కేసుకు సంబంధించిన ఆధారాలను మాయం చేసే ప్రయత్నం జరిగినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు సిట్ తెలిపింది.
నాగరాజుతో సురేష్‌కు సన్నిహిత సంబంధాలు
రిమాండ్ రిపోర్టు ప్రకారం.. సురేష్‌కు సీఐ నాగరాజుతో 2010 నుంచి పరిచయం ఉంది. ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సిట్ పేర్కొంది. నాగరాజుతో కలిసి సురేష్ నైట్ రౌండ్స్‌కు కూడా వెళ్లేవాడని తెలిపింది. మే 7న సాయికృష్ణను నాగరాజు, అశోక్, నాని విచారించిన సమయంలో సురేష్ అక్కడ ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ వివరాలను సురేష్ ఇచ్చిన సమాచారంతో పాటు కాల్ డీటైల్ రికార్డులు, సాంకేతిక ఆధారాలు, ఫోన్ సంభాషణలు, సీసీటీవీ ఫుటేజీలతో సిట్ పరిశీలిస్తున్నట్లు తెలిపింది.
హెబియస్ కార్పస్ ఉపసంహరణకు కుటుంబంపై ఒత్తిడి
సాయికృష్ణ కుటుంబ సభ్యులను కూడా కేసు నుంచి వెనక్కి తగ్గించేందుకు ప్రయత్నాలు జరిగినట్లు సిట్ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. హైకోర్టులో దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని కుటుంబ సభ్యులను బెదిరించడంతో పాటు, ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేసినట్లు దర్యాప్తులో తేలిందని తెలిపింది. ఈ క్రమంలో సాయికృష్ణ మేనమామ ముళ్లపూడి నవరంగ్‌ను సురేష్ సంప్రదించినట్లు సిట్ పేర్కొంది. మే 31న కొలనుకొండలోని మోడల్ డెయిరీ వద్ద నవరంగ్‌ను కలిసి పరిహారంపై మాట్లాడేందుకు ప్రయత్నించినట్లు రిమాండ్ రిపోర్టులో వివరించింది. అయితే ఆ ప్రతిపాదనను నవరంగ్ తిరస్కరించినట్లు తెలిపింది.
విజయవాడ నుంచి హైదరాబాద్.. అక్కడి నుంచి నాగ్‌పూర్
కేసు నమోదు, ఏ1 అరెస్టు తర్వాత సురేష్, ఏ2, ఏ3 కలిసి విజయవాడ నుంచి హైదరాబాద్, అక్కడి నుంచి నాగ్‌పూర్‌కు వెళ్లినట్లు సిట్ పేర్కొంది. తన ఆచూకీని పోలీసులు గుర్తించకుండా ఉండేందుకు మొబైల్ ఫోన్‌ను మార్గమధ్యంలోని కాలువలో పడేసినట్లు సురేష్ వెల్లడించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. తర్వాత సెప్టెంబర్ 18న సురేష్‌ను రాణిగారితోటలోని పాడుబడ్డ భవనం వద్దకు తీసుకెళ్లగా.. సాయికృష్ణను ఉంచిన ప్రదేశాన్ని అతడు గుర్తించినట్లు సిట్ తెలిపింది. అనంతరం స్వర్గపురి శ్మశానవాటికలో మృతదేహాన్ని దహనం చేసిన ప్రాంతాన్ని కూడా గుర్తించినట్లు పేర్కొంది.
రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం
సురేష్ ఇచ్చిన సమాచారంతో రెండు ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడు వెల్లడించిన వివరాలను కాల్ డీటైల్ రికార్డులు, సాంకేతిక విశ్లేషణ, ఏ1, ఏ2, ఏ4 మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు, మోడల్ డెయిరీ పరిసరాల్లోని సీసీటీవీ దృశ్యాలతో సిట్ పరిశీలిస్తోంది. ఈ పరిణామంతో సాయికృష్ణ మృతి కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లోనే జరిగిందన్న గత దర్యాప్తు దిశకు భిన్నంగా.. రాణిగారితోటలోని పాడుబడ్డ భవనంలో ఆయన మృతి చెందినట్లు సిట్ తాజా రిమాండ్ రిపోర్టులో వివరించింది.
ఏ4 సురేష్‌కు సెప్టెంబర్ 24 వరకు రిమాండ్
సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సుమారు మూడు నెలలుగా పరారీలో ఉన్న ఏ4 గులివిందల సురేష్ సెప్టెంబర్ 17న సిట్ ఎదుట లొంగిపోయాడు. లుక్అవుట్ సర్క్యులర్ నేపథ్యంలో సిట్ అతడిని అదుపులోకి తీసుకుని విచారించింది. విచారణ అనంతరం సురేష్‌ను విజయవాడ 2వ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. సాక్షులను ప్రభావితం చేయకుండా ఉండేందుకు రిమాండ్ విధించాలని సిట్ కోరింది. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం మేజిస్ట్రేట్ ఎస్. శ్రీకాంత్ సురేష్‌కు సెప్టెంబర్ 24 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. అనంతరం అతడిని నూజివీడు జైలుకు తరలించారు.
సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలతో.. ఆయనను ఎక్కడ, ఎలా హింసించారు? మృతదేహాన్ని ఎలా తరలించారు? ఆధారాలు, ఫొటోలను ఎందుకు తొలగించారు? కుటుంబ సభ్యులపై ఎలాంటి ఒత్తిడి తీసుకొచ్చారు? అనే అంశాలపై దర్యాప్తు మరింత కీలక దశకు చేరింది.








