తెలంగాణలో 2.33 శాతం తగ్గిన క్రైమ్ రేట్ – డీజీపీ శివధర్ రెడ్డి

తెలంగాణలో 2.33 శాతం తగ్గిన క్రైమ్ రేట్ – డీజీపీ శివధర్ రెడ్డి

Summarize with AI

రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం లేదని, రాష్ట్ర వ్యాప్తంగా నేరాలు నియంత్రణలో ఉన్నాయని తెలంగాణ డీజీపీ (Telangana DGP) శివ‌ధ‌ర్‌రెడ్డి (Shivadhar Reddy) అన్నారు. తెలంగాణ రాష్ట్ర వార్షిక నేర సమీక్ష నివేదికను డీజీపీ విడుదల చేశారు. ఉగ్రవాద, తీవ్రవాద కార్యకలాపాలు పూర్తిగా అదుపులోనే ఉన్నాయని తెలిపారు.

రాష్ట్రంలో జరిగిన ప్రధాన పండుగలు అన్నీ ప్రశాంతంగా ముగిశాయని, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన మెస్సీ ఈవెంట్ (Messi Event), గ్లోబల్ సమ్మిట్(Global Summit), అలాగే మే నెలలో జరిగిన మిస్ వరల్డ్ ఈవెంట్ (Miss World Event) కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా విజయవంతంగా నిర్వహించామని డీజీపీ వివరించారు. మూడు విడతలుగా నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు (Gram Panchayat Elections) కూడా ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యాయని చెప్పారు.

గత ఏడాది కాలంలో మొత్తం 509 మంది మావోయిస్టులు (Maoists) సరెండర్ అయ్యారని, వారిలో 24 మంది తెలంగాణకు చెందినవారని తెలిపారు. ఇది శాంతి స్థాపన దిశగా కీలక ముందడుగుగా పేర్కొన్నారు. ఈ సంవత్సరం నాలుగు జాతీయ లోక్ అదాలత్‌లు, ఒక స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహించామని, వీటి ద్వారా 7,22,487 కేసులు రాజీ ద్వారా పరిష్కరించామని వెల్లడించారు. కేసుల పరిష్కారంలో దేశంలో తెలంగాణ టాప్ స్థానంలో నిలిచిందని తెలిపారు.

ఈ ఏడాది ఈగల్ విభాగం ద్వారా రూ.173 కోట్ల విలువైన డ్రగ్స్‌ను సీజ్ చేశామని డీజీపీ వెల్లడించారు.
ఫోన్ల రికవరీ విషయంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని, CEIR ద్వారా వేల సంఖ్యలో ఫోన్లు రికవరీ చేశామని తెలిపారు. సైబర్ క్రైమ్‌లో 3 శాతం తగ్గుదల, ఆర్థిక నేరాల్లో 6 శాతం తగ్గుదల నమోదైందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం 2,28,000 కేసులు నమోదు కాగా, వాటిలో 1.5 లక్షల BNS కేసులు ఉన్నాయని తెలిపారు. మొత్తం 38.72 శాతం కన్విక్షన్ రేట్ పెరిగిందని, నాలుగు కేసుల్లో నిందితులకు మరణ శిక్ష, 216 కేసుల్లో 320 మందికి యావజ్జీవ శిక్ష పడిందని వెల్లడించారు.

గత 60 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనివిధంగా ఒక మహిళా ఎస్సై డీఎస్పీ స్థాయికి పదోన్నతి పొందడం చారిత్రాత్మక ఘట్టమని డీజీపీ పేర్కొన్నారు. మొత్తంగా, నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, టెక్నాలజీ వినియోగం, ప్రజల నమ్మకం పెంపొందించడంలో తెలంగాణ పోలీస్ విభాగం గణనీయమైన పురోగతి సాధించిందని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment