ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య వ్యవస్థ దుస్థితికి అద్దం పడుతూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో అవినీతి బాగోతం బట్టబయలైంది. ఉచితంగా అందించాల్సిన వైద్యానికి ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ డబ్బులు వసూలు చేయడం సంచలనంగా మారింది. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో సిబ్బంది సామాన్యులను పీల్చి పిప్పి చేస్తున్న వైనం ఒక మహిళ తీసిన సెల్ఫీ వీడియోతో వెలుగులోకి వచ్చింది.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక పేద మహిళ తన ఆవేదనను సెల్ఫీ వీడియో ద్వారా వ్యక్తం చేస్తూ, అక్కడ జరుగుతున్న అక్రమాలను వివరించింది. “అయ్యా, ఇది నర్సీపట్నం ఏరియా హాస్పిటల్.. ఇక్కడ ప్రతి చిన్న పనికి వంద రూపాయలు లంచం అడుగుతున్నారు” అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
బెడ్ కావాలంటే రూ.100, బెడ్ క్లీన్ చేయాలన్నా రూ.100, యూరిన్ బ్యాగ్ మార్చాలన్నా రూ.100, స్ట్రెచర్ మీద పేషెంట్‌ను తీసుకెళ్లాలన్నా రూ. 100 ఇలా ఆసుపత్రిలో సిబ్బంది పేషెంట్లను డిమాండ్ చేస్తున్నారు.
“మా దగ్గర డబ్బులు లేక కదా మేము ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేది? ప్రతిదానికి వంద రూపాయలు అంటే మేము ఎక్కడి నుండి తెస్తాం?” అని ఆమె ప్రశ్నించారు. అక్కడ పనిచేసే స్వీపర్లు, ఇతర స్టాఫ్ లంచం ఇస్తేనే గాని పనులు చేయడం లేదని ఆమె ఆరోపించారు.
వైసీపీ తీవ్ర విమర్శలు
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతిపక్ష వైసీపీ చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడింది. “ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య వ్యవస్థకు జబ్బు పట్టింది అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంది?” అంటూ విమర్శలు గుప్పించింది. ముఖ్యంగా శాసనసభ స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని ఆసుపత్రిలోనే ఇలాంటి పరిస్థితులు ఉండటం గమనార్హం. గతంలో మెరుగైన వైద్యం అందించిన ఆసుపత్రులు.. ఇప్పుడు లంచాలకు నిలయాలుగా మారుతున్నాయని బాధితులు వాపోతున్నారు. ఈ లంచగొండితనాన్ని అరికట్టాలని, పేద ప్రజలకు న్యాయం చేయాలని జనం కోరుతున్నారు.
ఆస్పత్రిలో బెడ్ కావాలంటే రూ.100 లంచం
— Telugu Feed (@Telugufeedsite) May 8, 2026
నర్సీపట్నం ప్రభుత్వ హాస్పిటల్లో బెడ్ కోసం రోజు వంద రూపాయలు లంచం ఇవ్వాలి
సెల్ఫీ వీడియో విడుదల చేసిన బాధితురాలు pic.twitter.com/wJKQydal6t








