‘మా పాప బ్రతికే హోప్స్ లేవు’.. మెడికో తండ్రి కన్నీరు

'మా పాప బ్రతికే హోప్స్ లేవు'.. మెడికో తండ్రి కన్నీరు

Summarize with AI

రాజమండ్రిలో మద్యం మత్తులో ఉన్న యువకుల కారు బీభత్సానికి గురై, తీవ్ర గాయాలతో హైదరాబాద్‌లోని కిమ్స్ (KIMS) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పీజీ వైద్య విద్యార్థిని ప్రియాంక ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. ఆమె బ్రెయిన్ పూర్తిగా డెడ్ అయిందని, బ్రతికే ఆశలు కనిపించడం లేదని ప్రియాంక తండ్రి వెంకటేష్ కన్నీటిపర్యంతమయ్యారు. మీడియాతో మాట్లాడిన ఆయన, తమ కుటుంబానికి ఎదురైన ఈ తీవ్ర విషాదాన్ని వివరిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రియాంక ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, ఆసుపత్రిలో జరుగుతున్న వైద్యంపై ఆమె తండ్రి పలు విషయాలను వెల్లడించారు. “వైద్యులు మా కూతురు బ్రతికే ఆశలు లేవని చెప్తున్నారు. బ్రెయిన్ పూర్తిగా డెడ్ అయిపోయింది. అప్నియా (Apnea) పరీక్ష చేస్తామని చెప్పారు కానీ, పాప బాడీ ప్రస్తుతం వైద్యానికి సహకరించడం లేదు. సోడియం లెవెల్స్ తీవ్రంగా పడిపోయాయి. మేము అప్నియా పరీక్ష వద్దని చెప్పలేదు.. సోడియం లెవెల్స్ సరైన స్థాయికి వస్తే ఆ పరీక్ష చేయవచ్చని వైద్యులు చెప్పారు. మా పాపను ఎలాగైనా బ్రతికించుకోవాలని చివరి క్షణం వరకు ప్రయత్నిస్తున్నాం.”

“పాప అవయవ దానంపై మేము ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటివరకు ఈ విషయమై మాతో ఎవరూ సంప్రదించలేదు. పాప పరిస్థితి చూసి తట్టుకోలేక నా సతీమణి తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆమెను కూడా ఐసీయూ (ICU)లో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నాం” అని చెప్పారు.

ప్రమాదం జరిగిన తీరును తండ్రి వివరిస్తూ నిందితులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కారులో ఉన్న ఇద్దరు నిందితులు సినిమా థియేటర్‌లో తీవ్రంగా మద్యం తాగి ఉన్నారు. అక్కడ థియేటర్ మేనేజ్‌మెంట్‌తో గొడవ పడ్డారు. ఆ కోపంతో కారును వేగంగా, నిర్లక్ష్యంగా బయటకు తీసుకొచ్చారు.

అదే సమయంలో వస్తున్న నా కూతురు ప్రియాంక, ఆమె స్నేహితుడు ఉమేష్ ప్రయాణిస్తున్న స్కూటీని కారుతో ఢీకొట్టారు. అంతటితో ఆగకుండా, కిందపడిన నా కూతురి తలపై నుంచి కారును ఎక్కించి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. రాజమండ్రికి చేరుకుని పాపను హుటాహుటిన హైదరాబాద్ కిమ్స్ (KIMS)కు తీసుకువచ్చాము. అక్కడ వైద్యులు ప్రాధేయపడటంతో వెంటనే స్పందించి చికిత్స ప్రారంభించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితులను అత్యంత కఠినంగా శిక్షించాలని, “ఇలాంటి వారిని నడిరోడ్డుపై కొట్టి చంపాలి” అని తండ్రి తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment