చంద్రబాబు శ్వేతపత్రంపై తిర‌గ‌బ‌డ్డ ఉద్యోగులు

చంద్రబాబు శ్వేతపత్రంపై తిర‌గ‌బ‌డ్డ ఉద్యోగులు

Summarize with AI

ఆంధ్ర‌రాష్ట్ర ఆదాయంలో 98 శాతం ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు, పెన్షన్లకే ఖర్చవుతున్నాయన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తీవ్రంగా తప్పుబట్టారు. సీఎం ప్రకటన వాస్తవాలకు విరుద్ధంగా ఉంద‌ని, ప్ర‌భుత్వ ఉద్యోగులను రాష్ట్రానికి భారంగా చూపించడం సరికాదని అన్నారు.

ఏపీ జేఏసీ అమరావతి చైర్మ‌న్ బొప్ప‌రాజు లెక్క‌ల ప్ర‌కారం… 2025–26లో రాష్ట్ర ప్రభుత్వ మొత్తం వ్యయం రూ.2.26 లక్షల కోట్లు కాగా, ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు కలిపి రూ.84,401 కోట్లు, అంటే మొత్తం ఖర్చులో 37 శాతం మాత్రమే అయ్యిందన్నారు. రాష్ట్ర పన్నుల ఆదాయం రూ.1,42,926 కోట్లు కాగా, అందులో ఉద్యోగుల ఖర్చు సుమారు 59 శాతం అని తెలిపారు. మొత్తం ఆదాయం రూ.1.78 లక్షల కోట్లుగా తీసుకుంటే ఉద్యోగులు, పెన్షనర్లపై ఖర్చు 47 శాతం మాత్రమేనని చెప్పారు.

ఉద్యోగులు ప్రభుత్వానికి వెన్నెముక అని, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసేది వారేనని బొప్పరాజు పేర్కొన్నారు. గ్రామస్థాయిలో పాలన కోసం గత ప్రభుత్వం 1.50 లక్షల సచివాలయ ఉద్యోగులను నియమించిందని గుర్తుచేశారు. ప్రతి ఏడాది వేల మంది ఉద్యోగులు రిటైర్ అవుతున్నారని, కొత్త ఉద్యోగులకు జీతాలు చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. అయినా ఉద్యోగులపై ఖర్చును భారీగా చూపడం ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపుతుందని విమర్శించారు.

కూటమి ప్రభుత్వం ఉద్యోగుల నుంచి శ్రమ దోపిడీ చేస్తోందని ఆరోపించిన బొప్పరాజు.. ప్రతి ఉద్యోగి ఏడాదిలో తొమ్మిది నెలల జీతమే తీసుకుంటున్నారని, మిగిలిన మూడు నెలల మొత్తాన్ని పన్నుల రూపంలో చెల్లిస్తున్నారని తెలిపారు.

ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై చంద్ర‌బాబు ప్రభుత్వం నుంచి ఎన్నో ఆశలు పెట్టుకున్న సమయంలో 98 శాతం ఆదాయం ఉద్యోగులకే వెళ్తోందని చెప్పడం షాక్‌కు గురిచేసిందన్నారు. కాగ్ లెక్కల ఆధారంగా తమ సంఘం అధ్యయనం చేసిందని వెల్లడించారు.

మాతో జరిగిన చర్చలపై ఈనెల 15లోపు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాని పీఆర్సీ కమిషన్‌ను ఎందుకు ఏర్పాటు చేయలేదని, ఉద్యోగులకు రావాల్సిన బకాయిల వివరాలను ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించారు. ఉద్యోగులపై అయ్యే ఖర్చును శ్వేతపత్రంలో ప్రకటిస్తున్న ప్రభుత్వం.. వారి బకాయిల విషయంలో మాత్రం పారదర్శకత ఎందుకు పాటించడం లేదని బొప్పరాజు నిలదీశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment