తిరుపతి (Tirupati) జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. చంద్రగిరి(Chandragiri) నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల (Panchayat Elections Nominations) తిరస్కరణను నిరసిస్తూ వైసీపీ(YSRCP) నియోజకవర్గ ఇన్చార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి (Chevireddy Mohith Reddy) ఆందోళనకు దిగారు. కలెక్టర్ ఛాంబర్ ముందు అంబేద్కర్ చిత్రపటంతో బైఠాయించి శాంతియుతంగా నిరసన చేపట్టారు.
చంద్రగిరి నియోజకవర్గవ్యాప్తంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు (Returning Officers – ROs) నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, వైసీపీ మద్దతుతో సర్పంచ్, వార్డు సభ్యుల (Ward Members) స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థుల నామినేషన్లను ఉద్దేశపూర్వకంగా తిరస్కరిస్తున్నారని మండిపడ్డారు.
అభ్యర్థులు ఆర్డీవో కార్యాలయాల్లో అన్ని పత్రాలతో నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ, వాటిలోని కొన్ని పేజీలను అధికారులే చించేస్తున్నారని మోహిత్ రెడ్డి పేర్కొన్నారు. నామినేషన్ల స్వీకరణ సమయంలో అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నాయని ధ్రువీకరిస్తూ ఆర్వోలు సంతకాలు చేసిన చెక్లిస్టులు(Checklists) ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు అదే పత్రాల్లో కొన్ని పేజీలు లేవంటూ అభ్యర్థుల ఎదుటే నామినేషన్లను తిరస్కరించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అభ్యర్థుల వద్ద అన్ని పత్రాలు ఉన్నట్లు అధికారులు ఇచ్చిన చెక్లిస్టులు సాక్ష్యంగా ఉన్నప్పుడు నామినేషన్లను ఎలా తిరస్కరిస్తారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ (District Collector) సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎన్నికలను ఇంత నిస్సిగ్గుగా నిర్వహించడం కంటే అన్ని స్థానాలను ఏకగ్రీవంగా ప్రకటించుకోవడం మంచిదని మోహిత్ రెడ్డి విమర్శించారు. కొందరు రిటర్నింగ్ అధికారులు డబ్బులకు అమ్ముడుపోయి నామినేషన్లను తిరస్కరించే స్థాయికి దిగజారారని మండిపడ్డారు.
నామినేషన్లు ఎందుకు తిరస్కరిస్తున్నారని ప్రశ్నిస్తున్న అభ్యర్థులకు సమాధానం చెప్పకుండా పోలీసులతో(Police) బలవంతంగా బయటకు పంపిస్తున్నారని తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గంలోని నామినేషన్ కేంద్రాల వద్ద బాధిత అభ్యర్థులు నిరసనలు చేపడుతున్నారని, పలుచోట్ల నడిరోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారని పేర్కొన్నారు.
నామినేషన్ల తిరస్కరణతో తమ రాజకీయ జీవితాలను నాశనం చేశారని అభ్యర్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని మోహిత్ రెడ్డి తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన రిటర్నింగ్ అధికారులందరిపైనా ఎన్నికల సంఘానికి (Election Commission) ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టులో(High Court) ప్రైవేటు కేసులు వేస్తామని స్పష్టం చేశారు.
బాధిత అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు కలెక్టర్ కార్యాలయాన్ని వదిలి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. నామినేషన్ పత్రాల్లో (Nomination Papers)పేజీలు మాయమవడం, చెక్లిస్టుల్లో అన్ని పత్రాలు ఉన్నప్పటికీ తిరస్కరించడం వంటి అంశాలపై కలెక్టర్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.








