భోగాపురంలో కుంగిన రోడ్లు.. బాబు పబ్లిసిటీపై సెటైర్లు

భోగాపురంలో కుంగిన రోడ్లు.. బాబు పబ్లిసిటీపై సెటైర్లు

Summarize with AI

ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి అంటే పబ్లిసిటీ.. అన్నట్లుగా సాగుతోంది చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీరు. రాష్ట్రానికి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టంటూ ప్ర‌చార హోరెత్తించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో నిర్మించిన రహదారుల అసలు రంగు అప్పుడే బట్టబయలైంది.

కోట్లాది రూపాయల ప్రజాధనంతో చేపట్టిన నిర్మాణాలు కొద్ది నెలలకే దెబ్బతిని, గుంతలమయంగా మారిన దృశ్యాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. భోగాపురం ఎయిర్‌పోర్టు రోడ్డులో కుంగి, దెబ్బ‌తిన్న రోడ్ల వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీంతో ఎయిర్‌పోర్ట్‌ గురించి ప‌తాక స్థాయిలో ప‌బ్లిసిటీ చేసుకున్న చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు, నెటిజ‌న్లు తీవ్ర స్థాయిలో తిట్టిపోస్తున్నారు.

కోట్లాది రూపాయల బడ్జెట్‌తో నిర్మిస్తున్నామని చెప్తున్న రహదారులు ఒక వర్షానికే కొట్టుకుపోతుంటే.. ఈ పనులను పర్యవేక్షిస్తున్న అధికారులు, కాంట్రాక్టర్లు ఏం చేస్తున్నారని ప్ర‌శ్నిస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలను గాలికి వదిలేసి, తమకు కావాల్సిన కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్టడంలో ఉన్న శ్రద్ధ.. ప్రజాధనానికి జవాబుదారీతనంగా ఉండడంలో కూటమి ప్రభుత్వానికి లేదని స్పష్టమవుతోందని మండిప‌డుతున్నారు.

విమానాశ్రయ నిర్మాణం పేరుతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రైతులు పడుతున్న అల్లాటల్లాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించడంపై ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. భారీ కాంట్రాక్టర్ల వాహనాల రాకపోకలతో పరిసర గ్రామాల రోడ్లన్నీ ధ్వంసమైపోగా.. పొలాలకు వెళ్లేందుకు, పండించిన పంటను మార్కెట్‌కు తరలించేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అభివృద్ధి అంటే కేవలం గ్రాఫిక్స్ చూపించడం, ప్రారంభోత్సవాల పేరుతో డబ్బా కొట్టుకోవడం కాదు. ప్రజాధనంతో నిర్మించే ప్రతి కట్టడానికీ జవాబుదారీతనం ఉండాలని చుర‌క‌లంటిస్తున్నారు. ఎయిర్‌పోర్టు కనెక్టివిటీ రోడ్ల నిర్మాణంలో జరిగిన అవినీతి, నాణ్యతా లోపాలపై చంద్రబాబు ప్రభుత్వం తక్షణమే ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

భోగాపురం విమానాశ్రయాన్ని రాష్ట్ర ప్రగతికి ప్రతీకగా నిలబెట్టాల్సింది పోయి.. కూటమి ప్రభుత్వ అవినీతికి, నాసిరకం నిర్మాణాలకు కేంద్రంగా మార్చడంపై ప్రజలు, వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రచార ఆర్భాటాలు పక్కనబెట్టి, నాణ్యమైన రహదారులతో రైతులకు, ప్రజలకు ఊరట నివ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment