“హవాయి చెప్పులు వేసుకున్న సామాన్యుడిని శాసనసభకు పంపిస్తా..” జనసేనాని పవన్ కళ్యాణ్ వేదికలపై గంభీరంగా చెప్పే ఈ సిద్ధాంతాల వెనుక ఉన్న అసలు రంగు తిరుపతి పుణ్యక్షేత్రంలో అత్యంత దారుణంగా బయటపడింది. ఏళ్ల తరబడి కుటుంబాలను, ఇళ్లను వదిలేసి పార్టీ జెండాను భుజాన మోసిన నిజమైన కార్యకర్తలకు జనసేనలో దక్కిన గౌరవం ఏంటో తిరుపతి ఘటన కళ్లకు కట్టింది.
కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ అడిగిన పాపానికి, తన వెంట తిరిగిన సొంత అనుచరుడి నుంచే తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు రూ.50 లక్షలు డిమాండ్ చేయడం, ఆ డబ్బులు ఇచ్చుకోలేక తీవ్ర మానసిక వేదనతో ఆ అభ్యర్థి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.
తిరుపతి 47వ డివిజన్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన జనసేన సీనియర్ నాయకుడు రాజేష్ ఆచారి కన్నీటి గాథ పవన్ కళ్యాణ్ పార్టీ పరువును రోడ్డున పడేసింది. రాజేష్ ఆచారి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో సొంత పార్టీ నాయకులే జనసేనను తిట్టిపోస్తున్నారు.
జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి గత 14 ఏళ్లుగా ఇల్లు, కుటుంబాన్ని పట్టించుకోకుండా జనసేన జెండా పట్టుకుని వీధుల్లో తిరిగిన కార్యకర్త రాజేష్ ఆచారి. తిరుపతిలో జనసేన పార్టీ తరఫున కార్పొరేటర్ అభ్యర్థిగా మొదట కార్యాలయం తెరిచింది కూడా ఆయనే.
47వ డివిజన్‌లో ముందస్తుగానే ప్రచార కరపత్రాలు, పోస్టర్లు సిద్ధం చేసుకుని నామినేషన్ వేస్తే.. చివరి నిమిషంలో స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు బి-ఫామ్ ఇవ్వడానికి ఏకంగా రూ.50 లక్షలు లంచం డిమాండ్ చేశారని రాజేష్ ఆచారి కన్నీరు పెట్టుకున్నారు.
డబ్బున్న వారికే పీఠం: అంతటి భారీ మొత్తం ఇచ్చుకోలేకపోవడంతో, రాత్రికి రాత్రే వేరే పార్టీ నుంచి వచ్చిన ధనవంతుడికి ఆ సీటును అమ్ముకున్నారని బాధితుడు రాజేష్ ఆచారి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్యాయత్నం చేశారు. “నా చావు చూసైనా పవన్ కళ్యాణ్ తిరుపతికి వస్తాడనుకుంటున్నా.. ఆరణి శ్రీనివాసులు నాశనమైపోతాడు” అంటూ ఆయన చేసిన విలపన ప్రతి జనసైనికుడి గుండెను పిండేస్తోంది.
అప్పుడూ అమ్ముకోవడమే.. ఇప్పుడూ అమ్ముకోవడమే!
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ జనసేన అసలు నైజం బట్టబయలైంది:
చేతులెత్తేసిన పవన్ కళ్యాణ్: స్థానిక ఎన్నికల్లో జనసేన సీట్ల సర్దుబాటుపై స్వయంగా పవన్ కళ్యాణ్ “టీడీపీ బలంగా ఉంది, మనకు సీట్లు రావు” అని చేతులెత్తేయడంతో క్షేత్రస్థాయిలో ఉన్న వేలాది మంది కార్యకర్తలు అనాథలుగా మారారు.
పార్టీ కోసం ప్రాణాలర్పించిన నిఖార్సైన కార్యకర్తలను పక్కనబెట్టి, రాత్రికి రాత్రే పచ్చ జెండా కప్పుకుని వచ్చిన బడా వ్యాపారులకు, కాంట్రాక్టర్లకు బి-ఫారమ్‌లు వేలం పాట తరహాలో అమ్ముకోవడంపై జనసేన శ్రేణులే బహిరంగంగా తిరుగుబాటు చేస్తున్నాయి.
“అప్పట్లో సీట్లు అమ్ముకున్నారు.. ఇప్పుడు కార్పొరేటర్, ఎంపీటీసీ టికెట్లను కూడా రూ.50 లక్షలకు వేలం వేస్తున్నారు” అని నిరసిస్తూ సోషల్ మీడియా వేదికగా జనసైనికులే పవన్ తీరుపై నిప్పులు చెరుగుతున్నారు.
అధికార వ్యామోహంలో పడి కార్యకర్తల త్యాగాలను, కష్టాన్ని వ్యాపారంగా మార్చేసి, రూ.50 లక్షల కోసం ఒక కార్యకర్త ప్రాణం తీసుకునే స్థాయికి తెగబడిన జనసేన నాయకత్వానికి ఈ ఎన్నికల్లో ప్రజలు, కార్యకర్తలే తగిన బుద్ధి చెప్పడం ఖాయంగా కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు.








