‘భారతి సిమెంట్స్‌’పై కుట్ర‌కు హైకోర్టు చెక్‌!

'భారతి సిమెంట్స్‌'పై కుట్ర‌కు హైకోర్టు చెక్‌!

Summarize with AI

ఇన్నాళ్లూ వైసీపీ(YSRCP) నేతలపై కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం(Chandrababu Naidu Government), తాజాగా వైఎస్ జగన్‌ (YS Jagan) కుటుంబ వ్యాపార సంస్థ అయిన ‘భారతి సిమెంట్స్‌’(Bharathi Cements)ను లక్ష్యంగా చేసుకుందా..? 2007 నుంచి స‌జావుగా సాగుతున్న ప‌రిశ్ర‌మ ఉత్ప‌త్తుల‌ను అడ్డుకునేందుకు కొత్త కొత్త దారులు, సాకులు వెతుకుతోందా..? త‌మ పార్టీ శ్రేణుల‌తో సిమెంట్ త‌యారీకి అవ‌స‌ర‌మైన ముడిస‌రుకును అడ్డుకుందా..? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. రాజ‌కీయ క‌క్ష‌సాధింపులో భాగంగానే ప్ర‌త్య‌ర్థిని ఎలాగైనా వేధించాలనే కుట్రపూరిత ప్రణాళికే దీని వెనుక ఉందనే చ‌ర్చ బ‌హిరంగంగానే జ‌రుగుతోంది.

ఏకంగా 16,000 మందికి ఉపాధి (Employment) కల్పిస్తున్న భార‌తి సిమెంట్స్‌ సంస్థ ఉత్పత్తిని(Production) నిలిపివేయాలనే కుట్ర‌తో.. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల (Contract Employees) ముసుగులో అరాచక శక్తులను అడ్డంపెట్టుకుని, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం భారతి సిమెంట్స్‌ను దెబ్బకొట్టాలని చూసినవారికి హైకోర్టు (High Court) తీర్పు చెంపపెట్టులా మారిందంటున్నారు సంస్థ ఉద్యోగులు.

కడప జిల్లా (Kadapa District) ఎర్రగుంట్ల–కమలాపురం (Yerraguntla–Kamalapuram) మండలాల పరిధిలోని నల్లలింగాయపల్లెలో ఉన్న భారతి సిమెంట్స్‌ కార్యకలాపాలకు అడ్డంకులు ఏర్పడటంపై కంపెనీ హైకోర్టును ఆశ్రయించగా.. సంస్థకు పోలీసు రక్షణ కల్పించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామం నేపథ్యంలో భారతి సిమెంట్స్‌పై జరుగుతున్న వ్యవహారాల వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. వైఎస్ జగన్‌ను ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నంలో భాగంగానే సంస్థను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

హైకోర్టు కీలక ఆదేశాలు
భారతి సిమెంట్స్‌(Bharathi Cements) 2007 నుంచి సంబంధిత చట్టబద్ధ సంస్థల నుంచి అవసరమైన అనుమతులు పొందుతూ కార్యకలాపాలు నిర్వహిస్తోందని హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. కరువు ప్రభావిత ప్రాంతంలో ఉన్న ఈ సంస్థ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని తెలిపింది. అదే సమయంలో ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రూపంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఖజానాలకు సుమారు రూ.7,300 కోట్లు చెల్లించిందని న్యాయస్థానం ప్రస్తావించింది. కంపెనీ వ్యాపార కార్యకలాపాలను బలవంతంగా అడ్డుకోవడం, రాకపోకలను నిరోధించడం తప్పనిసరిగా అరికట్టాల్సిన చర్యలని హైకోర్టు స్పష్టం చేసింది.

కంపెనీ కార్యకలాపాలను అడ్డుకుంటున్న మూకలపై ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసుల తీరును హైకోర్టు తలంటింది. చట్టపరమైన కారణం లేకుండా కంపెనీ కార్యకలాపాలను అకస్మాత్తుగా, బలవంతంగా అడ్డుకోవడం సరికాదని, ఇలాంటి పరిణామాలు యాజమాన్యం, ఉద్యోగులు, వారి కుటుంబాలు, రాష్ట్ర ఖజానాపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు. శాంతిభద్రతలను కాపాడటం, హింస, బెదిరింపులు, భయభ్రాంతులకు గురిచేసే చట్టవిరుద్ధ కార్యకలాపాలపై చర్యలు తీసుకోవడం పోలీసుల ప్రాథమిక బాధ్యత అని కోర్టు స్పష్టం చేసింది.

మైనింగ్ శాఖతో సహా సంబంధిత శాఖల నుంచి అవసరమైన ముందస్తు అనుమతులతోనే భారతి సిమెంట్స్‌ నడుస్తోందని హైకోర్టు పేర్కొంది. కంపెనీ రాకపోకలు, ఉత్పత్తి, ఇతర చట్టబద్ధ కార్యకలాపాలకు ఎలాంటి చట్టపరమైన ఆటంకాలు లేవని స్పష్టం చేసింది. కాంట్రాక్ట్ ఉద్యోగులు లేదా వారి అనుచరులు కంపెనీ కార్యకలాపాలు(Business Operations), వాహనాలు, ఉద్యోగులు, అధికారులు, మెటీరియల్ రాకపోకలను అడ్డుకోకుండా గతంలో కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఉన్న విషయాన్ని కూడా న్యాయస్థానం ప్రస్తావించింది.

అడ్డంకుల కారణంగా కంపెనీకి రోజుకు రూ.4 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు నష్టం జరుగుతోందని, దీనివల్ల రాష్ట్ర ఖజానాతో పాటు శాశ్వత ఉద్యోగులు, వారి కుటుంబాలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లుతోందని భార‌తి సిమెంట్స్ త‌ర‌పు న్యాయ‌వాది కోర్టుకు వివ‌రించారు. పోలీసులు, కలెక్టర్ నిర్లక్ష్యం కారణంగా శాంతిభద్రతల (Law and Order) సమస్య తలెత్తుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పరిశ్రమ ఆవరణలో నివసిస్తున్న శాశ్వత ఉద్యోగులు, వారి కుటుంబాల్లో భయాందోళనలు నెలకొన్నాయని తెలిపారు.

ఇండియన్ సిమెంట్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ (Indian Cements vs State of AP) కేసులో ఇదే హైకోర్టు పేర్కొన్న అంశాలను న్యాయమూర్తి ప్రస్తావించారు. పెద్ద సంఖ్యలో కార్మికులకు ఉపాధి కల్పిస్తూ, పన్నుల రూపంలో రాష్ట్రానికి ఆదాయం అందిస్తున్న పరిశ్రమను కార్మికుల నిరసనల కారణంగా మూసివేసే పరిస్థితి రాకూడదని పేర్కొన్నారు. హింస, ఆటంకాలు, అలజడులను నిరోధించి పరిశ్రమ తన చట్టబద్ధ కార్యకలాపాలను శాంతియుతంగా నిర్వహించుకునేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

పారిశ్రామిక శాంతిని కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని, రాష్ట్రానికి లబ్ది చేకూర్చే పరిశ్రమలను ఇలా మూసివేసేలా చేయడం సరికాదని తేల్చిచెప్పిన న్యాయమూర్తి జస్టిస్‌ కుంచం మహేశ్వరరావు.. ఈ వ్యాజ్యంపై తదుపరి విచారణను అక్టోబర్‌ 5కి వాయిదా వేశారు. కాగా, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను అడ్డుపెట్టుకుని సంస్థ కార్యకలాపాలకు ఆటంకాలు కలిగించడం వెనుక రాజకీయ ఉద్దేశం ఉంద‌నే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment