ఏపీలో నేడు పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. చంద్రగిరి, దర్శి, శింగనమల, పీలేరు, నక్కపల్లి, చక్రాయపేట ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘటనలు ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కించాయి. కొన్ని చోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద మహిళలు నిరసనకు దిగగా, మరికొన్ని ప్రాంతాల్లో టీడీపీ నాయకులు, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
చంద్రగిరి నియోజకవర్గంలోని సి.రామాపురంలో పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ అభ్యర్థి ప్రచారం చేయడం తో వైసీపీ బలపరిచిన అభ్యర్థి పుష్ప ప్రచారాన్ని అడ్డుకోవాలని కోరుతూ ఎస్సై విజయలక్ష్మి కాళ్లు పట్టుకున్నారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
దర్శి నియోజకవర్గం కురిచేడు మండలం దేకనకొండలో ఓటు వేసేందుకు వెళ్తున్న ఓటర్లను టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓటు వేసేందుకు వెళ్లే స్వేచ్ఛ కూడా లేదా అంటూ స్థానికంగా ప్రశ్నలు వ్యక్తమయ్యాయి.
శింగనమల మండలం ఉల్లికల్లులో దొంగ ఓట్ల వ్యవహారంపై ప్రశ్నించినందుకు వైసీపీ నేతలపై టీడీపీ నాయకులు కర్రలతో దాడికి దిగారు. విచక్షణారహితంగా జరిగిన ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
పీలేరు నియోజకవర్గంలోని వాయల్పాడు, జర్రావారిపల్లిలో రిగ్గింగ్‌ను అడ్డుకునేందుకు మహిళలు ముందుకొచ్చారు. టీడీపీ నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడుతుండగా వారిని మహిళలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో రిగ్గింగ్‌ను అడ్డుకున్న వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేసిన ఘటన చోటుచేసుకుంది.
హోంమంత్రి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోని నక్కపల్లి పోలింగ్ కేంద్రం వద్ద పోలీసుల వ్యవహారశైలి చర్చనీయాంశమైంది. వైసీపీ నేతలపై పోలీసులు ఆంక్షలు విధిస్తుండగా, హోంమంత్రి ఓటు వేసేందుకు రావడంతో పోలీసులు హడావిడి చేశారు. తమ పట్ల ఎందుకు వివక్ష చూపిస్తున్నారని వైసీపీ శ్రేణులు పోలీసులను ప్రశ్నించాయి. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.
వైఎస్సార్ జిల్లా చక్రాయపేట మండలం గడ్డంవారిపల్లిలో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన ప్రజలు తమకు ఓటు వేసే అవకాశం కల్పించాలని కోరుతూ పోలింగ్ కేంద్రం ఎదుటే కూర్చొని నిరసనకు దిగారు. ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం పోలింగ్ కేంద్రం ముందు ధర్నా చేయాల్సిన పరిస్థితి అక్కడ కనిపించింది.








