బంగాళాఖాతం (Bay of Bengal)లో ఈ రోజు ఉదయం 7:26 గంటలకు స్వల్ప భూకంపం (Earthquake) సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) విడుదల చేసిన వివరాల ప్రకారం, ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.2గా నమోదైంది. సముద్ర గర్భంలో కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇది తక్కువ లోతులో ఉండే భూకంపాలకు సాధారణ తీవ్రతగానే భావిస్తున్నారు.
ఈ ప్రకంపనల ప్రభావంతో బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించినట్లు సమాచారం. అయితే భూకంప తీవ్రత తక్కువగా ఉండటంతో ప్రాణ, ఆస్తి నష్టం ఏమీ జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. కొన్ని తీర ప్రాంతాల్లో మాత్రమే స్వల్ప కంపనలు ఉన్నాయని స్థానిక నివేదికలు చెబుతున్నాయి.
భూకంపం సముద్రంలోనే కేంద్రం ఏర్పడటం మరియు తీవ్రత ఎక్కువగా లేకపోవడం వల్ల సునామీ ముప్పు లేదని NCS అధికారులు స్పష్టం చేశారు. ఇలాంటి స్వల్ప భూకంపాలు చాలాసార్లు నమోదవుతుంటాయని, ప్రజలు అవసరంలేని భయానికి గురి కావాల్సిన పనిలేదని వారు తెలిపారు. అయితే ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఏర్పడినా వెంటనే స్పందించేందుకు సంబంధిత విభాగాలు సిద్ధంగా ఉన్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాయి. సముద్ర గర్భంలో జరిగే భూకంపాలను నిరంతరం ట్రాక్ చేస్తూ, ప్రమాద సూచనలు ఏవైనా ఉంటే వెంటనే ప్రజలకు సమాచారం అందించేందుకు అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.








